చలికాలంలో పెట్స్‌ని కాపాడండి ఇలా..

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

చలి కాలం మనతో పాటు పెంపుడు జంతువులూ ఇబ్బంది పడతాయి. ఈ చలచల్లని వాతావరణం వల్ల పెంపుడు......

చలికాలంలో పెట్స్‌ని కాపాడండి ఇలా..

చలి కాలం మనతో పాటు పెంపుడు జంతువులూ ఇబ్బంది పడతాయి. ఈ చలచల్లని వాతావరణం వల్ల పెంపుడు జంతువులు జబ్బుపడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.



ఇంట్లోనే మేలు

పెంపుడు కుక్కలకు పగటి వేళ డాగ్‌హౌస్‌లో ఉంచినా, రాత్రివేళ మాత్రం ఇంట్లో చోటు కల్పించాలి. చలి మరీ ఎక్కువగా ఉంటే వెచ్చని గదిలో బెడ్‌ ఏర్పాటు చేయాలి. ఇంట్లో టైల్స్‌ లేదా మార్బుల్‌ ఫ్లోరింగ్‌ ఉంటే కుక్కల కోసం నేల మీద మందపాటి దుప్పటి లేదా పరుపు పరవాలి. బొచ్చు ఎక్కువగా ఉండే కుక్కలు చలిని తట్టుకునే మాట నిజమే అయినా రాత్రివేళ మితిమీరే చల్లదనం వల్ల వాటికి న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుక్క ఏ జాతికి చెందినదైనా రాత్రివేళ రక్షణ తప్పనిసరి.


ఆహారం

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం చలికాలం కుక్కలు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఈ కాలంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కుక్కలకు అందించాలి. అలాగే తాజా నీళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇక ఇండోర్‌ డాగ్స్‌ వాటికి కావలసిన శక్తిని ఎక్కువగా నిద్రపోవటంతో పొందుతాయి. కాబట్టి వాటికి ఆహారం పరిమితంగా ఇవ్వాలి. లేదంటే ఇండోర్‌ డాగ్స్‌ ఈ కాలంలో బరువు పెరిగిపోతాయి. చలికాలం కుక్కలు స్టీలు గిన్నెల్లో నోరు పెట్టగానే వాటి నాలుకలు అంచులకు అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి ఆహారానికి ప్లాస్టిక్‌ గిన్నెలు వాడడం మేలు. 


వ్యాయామం

ఈ కాలంలో కుక్కలకు బద్ధకం పెరిగిపోతుంది. ఎక్కువగా నిద్రపోవటానికి ఇష్టపడుతూ ఉంటాయి. కాబట్టి వాటి బద్ధకం వదలాలంటే ప్రతిరోజూ వాటి చేత వ్యాయామం చేయించాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి తీసుకెళ్లటం, బాల్‌ విసిరి దాన్ని తీసుకొచ్చేలా పరిగెత్తించటం చేయాలి. 


గ్రూమింగ్‌

చలికాలం కుక్కల బొచ్చును చర్మానికి దగ్గరగా కత్తిరించకూడదు. ప్రతిరోజూ చిక్కులు లేకుండా దువ్వాలి. ఇలా క్రమంతప్పక దువ్వటం, బ్రషింగ్‌ చేయటం వల్ల ఈ కాలంలో వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోకుండా ఉంటాయి. మిగతా కాలాలతో పోలిస్తే ఈ కాలంలో కుక్కలకు స్నానం అవసరం తక్కువే! కాబట్టి నెలకోసారి చేయించినా సరిపోతుంది. స్నానం కోసం గోరువెచ్చని నీళ్లే వాడాలి. తక్కువ నీళ్లతో తక్కువ సమయంలో స్నానం ముగించేయాలి. 


తక్షణ వైద్యం

ఈ కాలంలో మనకులాగే కుక్కలను కూడా శ్వాసకోశ ఇబ్బందులు బాధిస్తాయి. కాబట్టి ఏమాత్రం నలతగా కనిపించినా వెంటనే వెటర్నరీ డాక్టర్‌కి చూపించాలి. ఈకాలంటో ఆర్థ్రయిటిస్‌, ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి పెద్ద వయసు కుక్కలుంటే వాటి ఆరోగ్య పరిస్థితి గురించి వెటర్నరీ డాక్టర్‌తో చర్చించి అవసరమైన మందులు వాడాలి. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.

Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST