నా కాస్మెటిక్స్‌ సురక్షితం

ABN , First Publish Date - 2021-05-10T06:18:33+05:30 IST

రసాయనాలు లేని సౌందర్య సాధనాలు ఉండవు. అయితే ఉత్తరాది బుల్లి తెర నటి, మోడల్‌ అష్కా గొరాడియా, చర్మ సంరక్షణకు తోడ్పడే హాని లేని సౌందర్య సాధనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. రినీ కాస్మెటిక్స్‌ పేరుతో లాంచ్‌ అయిన గొరాడియా సౌందర్య సాధనాల్లో...

నా  కాస్మెటిక్స్‌  సురక్షితం

రసాయనాలు లేని సౌందర్య సాధనాలు ఉండవు. అయితే ఉత్తరాది బుల్లి తెర నటి, మోడల్‌ అష్కా గొరాడియా, చర్మ సంరక్షణకు తోడ్పడే హాని లేని సౌందర్య సాధనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. రినీ కాస్మెటిక్స్‌ పేరుతో లాంచ్‌ అయిన గొరాడియా సౌందర్య సాధనాల్లో రసాయనాలు, జంతు ఉత్పత్తులు లేకపోవడం ఓ విశేషమైతే, వాటికి ఎఫ్‌.డి.ఎ అనుమతి దక్కడం మరో విశేషం!


గుజరాత్‌కు చెందిన అష్కా గొరాడియా 16 ఏళ్ల వయసులోనే ముంబయి చేరుకుని బుల్లితెర నటిగా పేరు తెచ్చుకుంది. భాభీ, నాగిన్‌, కుసుమ్‌ లాంటి ప్రముఖ హిందీ సీరియల్స్‌లో మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే నటనతో పాటు గొరాడియాకు తనదైన సొంత కాస్మెటిక్‌ బ్రాండ్‌ లాంచ్‌ చేయాలనేది ఓ తీరని కల. అందుకోసం ఎటువంటి రసాయనాలు, జంతు కొవ్వులు ఉపయోగించకుండా, సురక్షితమైన సౌందర్య సాఽధనాలు తయారుచేయాలని నిర్ణయించుకుంది. అలాగే సరికొత్తగా కనిపించడం కోసం మేక్‌పలో ప్రయోగాలు చేయాలనుకునేవారికి తగ్గట్టుగా తన కాస్మెటిక్స్‌ ఉండాలనేది ఆమె ఆలోచన. అలా 2018లో గుజరాత్‌లో 50 లక్షల పెట్టుబడితో, కేవలం 50 మంది ఉద్యోగులతో చిన్న మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించింది. ప్రారంభంలో ఫ్యాబ్‌ 5 ఇన్‌ 1 లిప్‌స్టిక్‌, బోల్డ్‌ 3డి ఐల్యాషె్‌సలతో పాటు మరికొన్ని పరిమిత కాస్మెటిక్స్‌ను తయారుచేసి, నైకా, అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మొదలైన ఇ కామర్స్‌లో అమ్మకాలు మొదలుపెట్టింది.


కృషి వృథా కాలేదు

రినీ కాస్మెటిక్స్‌ అనతి కాలంలోనే నమ్మదగిన కాస్మెటిక్‌  బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అమ్మకాలు పెరగడంతో, కొలిస్టిక్‌ ఐ రేంజ్‌, హై లైటర్లు, లిప్‌స్టిక్స్‌, రోల్‌ ఆన్స్‌, మేకప్‌ రిమూవింగ్‌ బామ్స్‌, బ్రష్‌ సెట్స్‌... ఇలా తన కాస్మెటిక్‌ ఉత్పత్తుల రేంజ్‌ను మరింత విస్తరించింది. కాస్మెటిక్‌ రంగం ఎంతో విస్తారమైనది. అలాంటి రంగంలో తనదైన స్థానం ఏర్పరుచుకోవాలంటే ఎంతో కష్టపడాలి. అందుకోసం తను ఎంచుకున్న మెలకువల గురించి ప్రస్తావిస్తూ.... ‘కాస్మెటిక్‌ రంగం విభిన్న ఉత్పత్తులతో నిండిపోయి ఉంది. దీన్లో నిలదొక్కుకోవాలంటే ఉత్పత్తుల పట్ల కొనుగోలుదారులకు నమ్మకం కలిగించాలి. అందుకోసం సురక్షితమైన, ప్రయోగాలకు అనుకూలమైన సౌందర్య సాధనాల తయారీ ఒక్కటే మార్గం. అందుకోసం నేను చేసిన కృషి వృథా కాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది గొరాడియా.


ఎత్తుగడలు, మెలకువలే కీలకం!

అందుబాటు ధరల్లో దొరికే సౌందర్య సాధనాలకే ఆదరణ ఎక్కువ. కాబట్టే గొరాడియా తన కాస్మెటిక్స్‌ రేంజ్‌ మొత్తాన్నీ 500 నుంచి 550 రూపాయలకే పరిమితం చేసింది. అలాగే టైర్‌ 1, టైర్‌ 2 పట్టణాల్లోని, 18 నుంచి 35 ఏళ్ల మధ్య మహిళలే లక్ష్యంగా కాస్మెటిక్స్‌ను రూపొందించింది. ఇందుకు కారణాన్ని వివరిస్తూ... ‘ఆన్‌లైన్‌లో కొత్త ట్రెండ్స్‌ను అనుసరిస్తూ, అందుకు తగిన ఉత్పత్తుల కోసం షాపింగ్‌ చేసే మహిళలే నా లక్ష్యం. ఇలాంటి వారి కోసం బోలెడన్ని కాస్మెటిక్స్‌ బ్రాండ్స్‌ మార్కెట్లో ఉన్నాయి. అయినా వాటికి బదులుగా నా బ్రాండ్‌నే మహిళలు ఎంచుకోవడానికి కారణం... వాటి ధర, తయారీలో నేను అనుసరించే నియమాలే! చర్మానికి సురక్షితమైనవి కాబట్టే నా కాస్మెటిక్స్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వ్యాపారంలో ట్రెండ్‌కు తగ్గట్టు నడుచుకోవడంతో పాటు కన్స్యూమర్లకు ఉత్పత్తుల పట్ల నమ్మకం కలిగించడం ఎంతో ముఖ్యం’ అంటూ తన విజయ రహస్యం గురించి చెప్పుకొచ్చింది గొరాడియా.

Read more