జర్మనీలోని సిక్కు సంస్థ కార్యకర్తపై ఎన్ఐఏ కేసు నమోదు
ABN , First Publish Date - 2021-12-31T20:46:23+05:30 IST
పంజాబ్‌లో ఉగ్రవాదాన్నిపునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నించిన
న్యూఢిల్లీ : పంజాబ్‌లో ఉగ్రవాదాన్నిపునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) కార్యకర్తపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. జర్మనీ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ కార్యకర్త జస్విందర్ సింగ్ ముల్తానీతోపాటు, ఆయన సహచరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది.
జస్విందర్ సింగ్ ముల్తానీతోపాటు ఆయన సహచరులపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు ప్రారంభించినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఎన్ఐఏ దర్యాప్తు బృందం త్వరలో జర్మనీ వెళ్లి, మరిన్ని వివరాలను రాబట్టబోతున్నట్లు తెలిసింది.
భారత దేశం నుంచి పంజాబ్‌ను వేరు చేయాలనే భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా నిందితులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. పంజాబ్ యువతను క్షేత్ర స్థాయిలోనూ, ఆన్‌లైన్‌లోనూ నియమించుకుని, వారిని రాడికలైజ్ చేసి, ప్రేరేపించేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ నిందితులు విదేశాల్లోని ఖలిస్థాన్ అనుకూల శక్తులతో చేతులు కలిపి ఈ కుట్రను అమలు చేస్తున్నట్లు ఆరోపించింది.
పంజాబ్‌లోని స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను అక్రమంగా సంపాదించేందుకు నిధులను సేకరిస్తోందని పేర్కొంది. ముల్తానీకి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆపరేటివ్స్‌తో సంబంధాలు ఉన్నాయని, ముంబై, తదితర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
భారత ప్రభుత్వం అందజేసిన సమాచారం మేరకు ముల్తానీని జర్మన్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముల్తానీతోపాటు ఆయన సహచరులపై దర్యాప్తు చేయాలని ఎన్ఐఏను కేంద్ర ప్రభుత్వం గురువారం ఆదేశించింది.
ముల్తానీతోపాటు మరికొందరిపై 2021లో పంజాబ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేశారని; సాగు చట్టాలపై నిరసనల సమయంలో ఓ రైతు సంఘం నేతను హత్య చేసి, తద్వారా అశాంతిని రెచ్చగొట్టాలని కుట్ర పన్నినట్లు ఆరోపించారు. గత వారం లూధియానా కోర్టులో జరిగిన పేలుడు సంఘటనతో కూడా ముల్తానీకి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.