రైతులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2021-02-06T17:13:32+05:30 IST

రైతులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి

రైతులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి

చెన్నై : సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రూ.12,110 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం శాసనసభలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16.43 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని ఆయన తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌, నివర్‌, బురేవి తుఫాన్లు, రుతుపవన ప్రభావిత వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతుల రుణభారాన్ని తగ్గించే దిశగా సహకార బ్యాంకులు వారికిచ్చిన రూ.12110 కోట్ల పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. చేపాక్‌ కళైవానర్‌ ఆరంగంలో శాసనసభ సమావేశాల ముగింపు రోజైన శుక్రవారం ఆయన 110 సభా నిబంధన కింద పంట రుణాల మాఫీ ప్రకటన చేశారు. 


వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్ట పోయారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని, 2016లో జయలలిత రెండోసారి అధికారంలోకి రాగానే ఆ యేడాది మార్చి 31న పెండింగ్‌లో ఉన్న రూ. 5318.73కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారని ఎడప్పాడి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  2017లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు రూ.2247 కోట్ల మేరకు కరవు నివారణ ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించామని ఆయన తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌, రెండు తుఫానులు, అకాల వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి, చెరకు, అరటి పంటలు నీట మునిగాయని, తన నాయకత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సిద్ధమై రూ.1717 కోట్ల విలువైన వ్యవసాయ పనిముట్లు, వంగడాలు, ఎరువులు తదితర పంటల ఉత్పత్తికి అవసరమైన సామగ్రిని కూడా పంపిణీ చేశామని ఆయన వివరించారు.


ఇంత చేసినా పంట నష్టాలు కలిగించిన కష్టాల నుంచి రైతులు కోలుకోలేకున్నారని గమనించిన తమ ప్రభుత్వం సహకార బ్యాంకులలో గత జనవరి 31 వరకు రైతులు పొందిన రూ.12110 కోట్ల పంట రుణాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించిన ఎడప్పాడి తానొక రైతు బిడ్డనని, రైతుల కష్టాలు ఏమిటో తనకు బాగా తెలుసునని చెప్పారు. పంట రుణాలను మాఫీకి సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేస్తున్నామని, త్వరలో  ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సహకార బ్యాంకుల నుంచి రైతులు పొందిన పంట రుణాల మాఫీకి సంబంధించి నిధుల కేటాయింపులు జరుగుతాయని ఆయన వివరించారు.


విల్లుపురంలో జయ పేరుతో వర్సిటీ...

విల్లుపురం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు కానున్న విశ్వవిద్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరును పెట్టేందుకు వీలుగా ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్‌ శుక్రవారం అసెంబ్లీలో ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టారు. వేలూరు, తిరువళ్లూరు నగరాలు ప్రధాన కేంద్రంగా కలిగి రెండు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. ఆ విశ్వవిద్యాలయాల పరిధిలో కళాశాలల సంఖ్య అత్యధికంగా ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం వాటిని విభజిం చాలని విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచించారు. వారి సూచనలను అంగీకరించిన ప్రభుత్వం వేలూరు, తిరువళ్లూరు విశ్వవిద్యాల యాలను విభజించాలని నిర్ణయించి విల్లుపురం ప్రధాన కేంద్రంగా కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ విశ్వవిద్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్‌ విల్లుపురం విశ్వవిద్యాలయానికి జయలలిత పేరు పెట్టేలా ముసాయిదా చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు.


జల్లికట్టు కేసుల రద్దు

తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీలను అనుమతించాలని కోరుతూ మెరీనా బీచ్‌లో చేపట్టిన ఆందోళన సమయంలో నమోదు చేసిన కేసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  పళనిస్వామి ప్రకటించారు. అసెంబ్లీలో శుక్రవారం ఉదయం గవర్నర్‌ ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జల్లికట్టు ఉద్యమ రోజుల్లో పోలీసులపై దాడి, వాహనాలకు నిప్పంటించడం వంటి కేసులు మినహాయించి మిగతా కేసులన్నింటినీ ఆర్టికల్‌ 110 కింద వెనక్కి తీసుకోనున్నట్లు సీఎం వివరించారు.  


నాగూర్‌ దర్గా కొలను ప్రహరీకి శంకుస్థాపన...

నాగపట్టినం జిల్లా నాగూర్‌ దర్గా కొలనుచుట్టూ నిర్మించనున్న ప్రహరీగోడకు ముఖ్యమంత్రి  శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. రూ.4.34 కోట్లతో ఆ ఆలయ కొలను ప్రహరీ నిర్మించనున్నారు. చెన్నై సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  400 యేళ్ల ప్రాచీనమైన నాగూర్‌ దర్గాను గత డిసెంబర్‌ తొమ్మిదిన ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఆ సందర్భంగా ఆ దర్గా కొలను ప్రహరీ వరదల కారణంగా శిథిలమై ఉండడం గమనించి, త్వరలో ఆ కొలను ప్రహరీని ప్రభుత్వమే నిర్మించనున్నదని ప్రకటించారు. ఆ మేరకు ప్రహరీ గోడల నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఓఎస్‌ మణియన్‌, నీలోఫర్‌ కపిల్‌, సి.వలర్మతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌, బీసీలు, మైనారిటీల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ చంద్రమోహన్‌, మైనారిటీల సంక్షేమ సంఘం డైరెక్టర్‌ సీ సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-02-06T17:13:32+05:30 IST