బాధిత ప్రాంతాలను తక్షణం ఆదుకోండి!

ABN , First Publish Date - 2021-11-21T14:06:53+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా వర్షబాధిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, బాధితులకు తగిన నష్టపరిహారం అందించే విషయంపై సచివాలయంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ

బాధిత ప్రాంతాలను తక్షణం ఆదుకోండి!

- ఎక్కడా అలక్ష్యం వద్దు  

- మంత్రివర్గ సహచరులకు స్టాలిన్‌ దిశానిర్దేశం


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా వర్షబాధిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, బాధితులకు తగిన నష్టపరిహారం అందించే విషయంపై సచివాలయంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సమగ్రంగా చర్చించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, రెండు వాయుగుండాల కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంటనష్టాలు, ఆస్తినష్టాలు సంభవించిన జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సిన నివారణ చర్యలు గురించి కూడా చర్చించారు. కేంద్ర నుంచి వరద సహాయక నిధులను పొందే విషయంపై కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంతివర్గ సహచరులతో చర్చించారు. ముఖ్యంగా పంటలను నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సమీక్షించారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, వాగులు తదితర నీటి వనరులను మరమ్మతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారు. వర్షబాధిత ప్రాంతాల్లో సోమవారం నుంచి కేంద్ర పరిశీలక బృందంతో ప్రస్తావించాల్సిన అంశాలు గురించి కూడా చర్చించారు. కేంద్రం బృందం సంగతెలాగున్నా... మంత్రులు తమ తమ జిల్లాల్లో బాధితులను తక్షణం ఆదుకోవాలని, ఎక్కడా అలక్ష్యం చూపరాదని ఈ సందర్భంగా సీఎం మంత్రులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, పొన్ముడి, కేఎన్‌ నెహ్రూ, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, వీవేలు, తంగం తెన్నరసు, పీకే శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T14:06:53+05:30 IST