ఉద్ధవ్ థాకరేతో మహారాష్ట్ర హోం మంత్రి భేటీ

ABN , First Publish Date - 2021-03-24T15:42:57+05:30 IST

అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్

ఉద్ధవ్ థాకరేతో మహారాష్ట్ర హోం మంత్రి భేటీ

ముంబై : అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. వీరిద్దరూ దాదాపు ఓ గంట సేపు చర్చలు జరిపారు. దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఉంది. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ముఖ్యమంత్రికి దేశ్‌ముఖ్ వివరించినట్లు సమాచారం. తనపై జరుగుతున్న దుష్ప్రచారం తనను కలచివేసినట్లు తెలిపారని తెలుస్తోంది.


ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఇటీవల అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి, తనకు ఇవ్వాలని దేశ్‌ముఖ్ పోలీసులను డిమాండ్ చేశారని ఆరోపించారు. 


కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ, అనిల్ దేశ్‌ముఖ్ పోలీసు అధికారుల బదిలీల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన ఈ సొమ్మును వసూలు చేస్తున్నది తనకోసమా, తన పార్టీ కోసమా, ప్రభుత్వం కోసమా? అనే విషయం తెలియవలసి ఉందన్నారు. 


ఇదిలావుండగా, మహారాష్ట్ర మంత్రివర్గం బుధవారం ముంబైలో సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పోలీసు శాఖకు సంబంధించిన ప్రస్తుత పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పరంబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి, తనను హోం గార్డ్స్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయడాన్ని సవాలు చేసిన విషయంపై కూడా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. 


ప్రతి వారం జరిగే కేబినెట్ సమావేశం కొన్ని కారణాలతో గత వారం జరగలేదు. మహారాష్ట్ర శాసన సభ సమావేశాలు మార్చి 10న ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇదే. 


ఇదిలావుండగా, అనిల్ దేశ్‌ముఖ్‌కు తన పార్టీ ఎన్‌సీపీ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-03-24T15:42:57+05:30 IST