యవ్వనంగా కనిపించాలంటే..!

ABN , First Publish Date - 2021-02-15T18:13:08+05:30 IST

వయసు పైబడుతున్న కొద్దీ చర్మం నునుపుదనం బాగా తగ్గుతుంది. కాంతివిహీనంగా మారుతుంది. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని యాంటీ ఏజింగ్‌ ఫేస్‌ మాస్కులు ఉన్నాయి. వీటిని వారానికి రెండు లేదా మూడుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది.

యవ్వనంగా కనిపించాలంటే..!

ఆంధ్రజ్యోతి(15-02-2021)

వయసు పైబడుతున్న కొద్దీ చర్మం నునుపుదనం బాగా తగ్గుతుంది. కాంతివిహీనంగా మారుతుంది. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని యాంటీ ఏజింగ్‌ ఫేస్‌ మాస్కులు ఉన్నాయి. వీటిని వారానికి రెండు లేదా మూడుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది.  


గుడ్డులోని తెల్లసొనలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతలు పడకుండా సంరక్షిస్తాయి. అంతేకాకుండా తెల్లసొన చర్మానికి అవసరమైన అదనపు పోషకాలను కూడా అందిస్తుంది. అందుకే తెల్లసొనలో కొద్దిగా పాలమీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.


అరటి పండులో విటమిన్‌ ఎ, ఇ, బిలు బాగా ఉంటాయి. అందుకే బాగా మగ్గిన అరటిపండును తీసుకుని దాన్ని సన్నటి ముక్కలుగా తరిగి వాటిల్లో ఒక్కొక్క టీస్పూన్‌ చొప్పున రోజ్‌ వాటర్‌, తేనె, పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 


చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బంగాళాదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగాళాదుంపలో విటమిన్‌-సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం నిగనిగలాడుతూ యవ్వనంగా ఉండేలా చేసే కొలొజిన్‌ ఉత్పత్తిని బాగా పెంచుతుంది. దీంతో  వయసు పెరగడంతో తలెత్తే చర్మంలోని సాగేపోయే గుణాన్ని నివారిస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. అందుకే బంగాళాదుంపలను ముక్కలుగా తరిగి వాటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పలుచని వస్త్రంలో పెట్టి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఆ బంగాళాదుంప రసంలో దూదిని ముంచి దానితో  ముఖాన్ని, మెడ భాగాన్ని బాగా రుద్దుకోవాలి.  పావుగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. 


కొబ్బరిపాలు చర్మానికి రాసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు, యాంటిఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాలుష్యరహితంగా చేస్తాయి. చర్మ రంధ్రాల్లోని మురికిని  పోగొడతాయి. కొబ్బరిపాలలో దూదిని ముంచి దానితో ముఖాన్ని, మెడను బాగా రుద్దుకొని, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పట్టులా మారుతుంది.

Read more