ల్యాబ్ అసిస్టెంట్‌ల వెట్టిచాకిరీ

ABN , First Publish Date - 2021-12-16T06:28:13+05:30 IST

గత 25 సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పార్ట్‌ టైం ల్యాబ్‌ అసిస్టెంట్్స్‌గా మొత్తం 47 మంది పని చేస్తున్నారు. వారిలో నేనూ ఒకణ్ణి. మాకు 2017నుంచి నెలకు రూ. 7800/– వేతనాన్ని...

ల్యాబ్ అసిస్టెంట్‌ల వెట్టిచాకిరీ

గత 25 సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పార్ట్‌ టైం ల్యాబ్‌ అసిస్టెంట్్స్‌గా మొత్తం 47 మంది పని చేస్తున్నారు. వారిలో నేనూ ఒకణ్ణి. మాకు 2017నుంచి నెలకు రూ. 7800/– వేతనాన్ని, అది కూడా ఏడాదికి పది నెలలు మాత్రమే ఇస్తున్నారు. ఇన్నాళ్లుగా మేము కేవలం ల్యాబ్ అసిస్టెంట్స్ గానే కాకుండా ల్యాబ్ అటెండర్ గానూ, కంప్యూటర్ ఆపరేటర్ గానూ పని చేస్తున్నాము. అంతేకాదు అడ్మిషన్స్‌, స్కాలర్‌ షిప్స్‌, ఎగ్జామి నేషన్స్, టైపింగ్, బ్యాంక్‌, పోస్టల్‌ పనులు, ఇంకా పలు చిన్నా చితకా పనులను మా చేత చేయించుకుంటున్నారు. మా శ్రమ దోపిడీ చేస్తున్నారు. అయినా మాకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదు. 2021 జూన్‌ నుంచి మాకు అసలు వేతనాలు ఇవ్వడం లేదు. ఈ డిసెంబర్ లో కూడా ఇంతవరకు మాకు వేతనం రాలేదు. గత ఆరు నెలలుగా బకాయి పడ్డ వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. ఏ నెల వేతనం ఆ నెల ఇవ్వక పోవడం వలన కుటుంబ పోషణ భారమైపోయింది. పిల్లల చదువుల విషయంలో అంతులేని ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. ఏ నెల వేతనం ఆ నెల ఇచ్చినా సరి పోని గడ్డురోజులివి. గత ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం వలన ఇటు ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో పాటు నిత్యావసర సరుకులు సమకూర్చుకునేందుకు అప్పల పాలవుతున్నాం. అలా చస్తూ బతుకుతూ జీవితాలు నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మాతో పాటు పని చేసే రెగ్యులర్‌, మినిమం టైం స్కేల్, కాంట్రాక్ట్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగులు అందరికీ వేతనాలు ఇస్తున్నారు. మాకు మాత్రమే గత ఏడు నెలల నుంచి ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మాకు రావలసిన పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలి. అందరితో పాటు మాకూ నెల నెలా వేతనం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. 

యండి. సయ్యద్‌ ఉర్‌ రహమాన్‌,

పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

Read more