ఎవరిది ఈ పాపం?

ABN , First Publish Date - 2021-10-31T05:36:58+05:30 IST

‘ఓటేయడానికి మాకూ పైసలియ్యాలె. కొంతమందికే పైసలివ్వడం ఏమిటి?’ అని హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక సందర్భంగా పలు గ్రామాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయడం చూశాం. ఈ విధంగా డబ్బులు డిమాండ్‌ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర ప్రధాన...

ఎవరిది ఈ పాపం?

‘ఓటేయడానికి మాకూ పైసలియ్యాలె. కొంతమందికే పైసలివ్వడం ఏమిటి?’ అని హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక సందర్భంగా పలు గ్రామాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయడం చూశాం. ఈ విధంగా డబ్బులు డిమాండ్‌ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ప్రకటించారు. ఆయన నిబంధనల ప్రకారం మాట్లాడి ఉండవచ్చును గానీ డబ్బులు ఇవ్వనిదే ఓటు వేసేది లేదని ప్రజలు భీష్మించుకొని కూర్చొనే పరిస్థితి ఎవరు కల్పించారు? అన్నది ప్రధాన ప్రశ్న. ఎన్నికల బరిలో తలపడుతున్న ప్రధాన పార్టీలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కొక్క ఓటరుకూ ఆరు వేల వంతున, భారతీయ జనతా పార్టీ పదిహేను వందల వంతున పంచిపెడుతున్నాయని మీడియా ఘోషించినప్పుడు నిద్ర నటించిన ఎన్నికల కమిషన్‌ అంతా అయిపోయాక ఇప్పుడు ఓటర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం వింతగా ఉంది. ఓటు వేయడానికి పైసలు డిమాండ్‌ చేయవచ్చునన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడటానికి రాజకీయ పార్టీలు కారణం కాదా? ఎన్నికల్లో డబ్బు పంచడం బహిరంగ రహస్యంగా మారిపోయిన విషయం వాస్తవం కాదా? రాజకీయ పార్టీలను కట్టడి చేయాల్సిందిపోయి ప్రజలపై కేసులు పెడతామని హెచ్చరించడం ఏమిటి? ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ విఫలమవడం వల్లనే డబ్బు ప్రభావం నానాటికీ ప్రబలిపోవడం నిజం కాదా? ఓటర్లపై చర్యలు తీసుకునే ముందు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా హుజూరాబాద్‌లో డబ్బు పంపిణీ చేశారు. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఇదివరకే ఏర్పడినప్పటికీ ఇప్పుడు హుజూరాబాద్‌కు జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఒక్కో ఓటరుకూ ఆరు వేల నుంచి పది వేల రూపాయల వరకు పంచడం అంటే రాజకీయ పార్టీలు ఎంతగా బరి తెగించాయో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగినప్పటికీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో లేనందున పెద్దగా డబ్బు పంపిణీ అవసరం ఏర్పడలేదు. హుజూరాబాద్‌లో మాత్రమే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పవచ్చు. తన నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించిన ఈటల రాజేందర్‌ను కేసీఆర్‌ తన మంత్రివర్గం నుంచి ఉన్నపళంగా బర్తరఫ్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఈటలపై భూకబ్జా కేసులు పెట్టించారు. దీంతో రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి హుజూరాబాద్‌లో తనను ఓడించవలసిందిగా కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. దీంతో హుజూరాబాద్‌లో శనివారం పోలింగ్‌ జరిగినప్పటికీ గత ఐదు నెలలుగా బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తూ వచ్చారు. చివరకు ఈ పోటీ ఈటల రాజేందర్‌కూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ మధ్య పోటీలా మారింది. టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నది గెల్లు శ్రీనివాస్‌ అయినప్పటికీ అక్కడ పోటీలో ఉన్నది కేసీఆర్‌ అని సర్వత్రా అభిప్రాయం ఏర్పడింది. ఈ కారణంగా ఈటలను ఓడించడం కోసం కేసీఆర్‌ తన సర్వశక్తులనూ ప్రయోగించారు. ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావుకు టాస్క్‌ అప్పగించారు. దళితబంధు పథకాన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి హుజూరాబాద్‌ కోసం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయినా ప్రజల నాడి ఈటల వైపే మొగ్గుతున్నదని నివేదికలు రావడంతో ముందుగా ఈటల అనుయాయులను టీఆర్‌ఎస్‌ వైపు తిప్పుకొన్నారు. ఇందుకోసం ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్నీ పెట్టారు. మొత్తానికి పోలింగ్‌ సమీపించే నాటికి రాజేందర్‌ను ఒంటరిని చేయగలిగారు. అయినా ఆయనపై ప్రజల్లో సానుభూతి తగ్గకపోవడంతో ఓటర్లకు డబ్బు ఆఫర్‌ చేయడం మొదలుపెట్టారు. ఒక అంచనా ప్రకారం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం మొదలైన నాటి నుంచి పోలింగ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ దాదాపు 200 కోట్లు ఖర్చు చేసిందని చెబుతున్నారు. కేసీఆర్‌కు సవాలుగా మారిన ఈటల రాజేందర్‌ కూడా 30 నుంచి 40 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఒక్కో ఓటరుకు పదిహేను వందల చొప్పున ఈటల పంచారని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున లక్షన్నర మందికి ఆరు వేల రూపాయల వంతున పంచారని చెబుతున్నప్పటికీ కింది స్థాయి నాయకులు కొంత మొత్తాన్ని నొక్కేసినట్టు ప్రచారం జరుగుతోంది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో కూడా అధికార పార్టీ డబ్బు పంపిణీ చేస్తూనే ఉండటం కీడును సూచిస్తోంది. ఈటల రాజేందర్‌ తరఫున తక్కువ మొత్తం ఇచ్చినప్పటికీ అందరికీ సజావుగా అందిందట. ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుస్తారా? ఈటల రాజేందర్‌ గెలిచి కేసీఆర్‌కు అసలైన సవాల్‌ విసురుతారా? అన్నది నవంబర్‌ 2వ తేదీన వెల్లడవుతుంది. ఈ ఉప ఎన్నిక రావడానికి కేసీఆర్‌ ఎంత కారణమో ఈటల కూడా అంతే కారణం. 


తేడా వస్తే.. ఇక అంతే!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఇక్కడ ఎన్నికల్లో డబ్బు ప్రభావం అంతగా ఉండేది కాదు. 2014కి పూర్వం కొన్ని నియోజకవర్గాలలో ఐదు కోట్ల వరకు ఖర్చయ్యేది. తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో డబ్బు ప్రభావం అమాంతం పెరిగిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సగటున పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డిని ఓడించడం కోసం వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇటీవల నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కె.జానా రెడ్డిని ఓడించడానికి కూడా వంద కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న పట్టుదలతో వందల కోట్లు ఖర్చు చేశారు. ఇంత డబ్బు ఎక్కడిది? అన్న విషయం పక్కన పెడితే, తెలంగాణలో కూడా ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చిన ఘనత మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. తెలంగాణలో ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల వ్యయం వేలల్లోనే ఉండేది. 1983లో తెలుగుదేశం తరఫున జగిత్యాల నుంచి పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డికి అయిన ఖర్చు పదిహేను వేలు మాత్రమే. తన వద్ద ఉన్న పది వేలూ ఖర్చవడంతో మరో ఐదు వేలు ఇప్పిస్తే గెలుస్తానని ఆయన పార్టీ అధినేత ఎన్టీఆర్‌ను కోరడం, వెంటనే ఆ మొత్తాన్ని ఎన్టీఆర్‌ సర్దుబాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో జీవన్‌ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు. అదే తెలుగుదేశం పార్టీలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రతిపక్షాలు పోటీపడలేనంతగా ఎన్నికల ఖర్చును పెంచేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను కేసీఆర్‌ ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ హుజూరాబాద్‌లో ఈటలను ఓడించలేకపోతే కేసీఆర్‌కు కష్టాలు మొదలవుతాయి. ప్రజల్లో ఇప్పటికే ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో ఓడిపోతే కేసీఆర్‌ ప్రభ మసకబారుతుంది. పార్టీపై కూడా ఆయన పట్టు సడలుతుంది. కేసీఆర్‌ వ్యవహార శైలి వల్ల టీఆర్‌ఎస్‌లో అసంతృప్తికి కొదవ లేదు. అయితే ప్రజల్లో ఆయనకు ఇంకా పట్టు ఉందన్న భావనతో వారంతా తగ్గి ఉంటున్నారు. ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేశాక కూడా ఫలితాలు సానుకూలంగా రాని పక్షంలో ఏమి జరుగుతుందో అందరికంటే కేసీఆర్‌కే ఎక్కువ తెలుసు. పార్టీపైన, ప్రభుత్వంపైన తన పట్టును సుస్థిరం చేసుకోవడం కోసమే హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ఇంతలా తెగించారు. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఎదురులేని పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి, కాంగ్రెస్‌ నుంచి ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందన్న వార్తలు రావడంతో కేసీఆర్‌ కలవరం చెందుతున్నట్టు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నాయకులు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న సమాచారం ఆయనకు తెలియకుండా ఉంటుందా? అందుకే రెండున్నరేళ్లుగా పక్కన పెట్టి కేవలం సిద్దిపేటకు మాత్రమే పరిమితం చేసిన హరీశ్‌ రావును మళ్లీ చేరదీశారు. నాగార్జునసాగర్‌లో గెలుపు అవకాశం ఉండటంతో అక్కడ ఇంచార్జిగా తన కొడుకు కేటీఆర్‌ను నియమించిన కేసీఆర్‌, హుజూరాబాద్‌లో గడ్డు పరిస్థితులు ఉన్నందున మేనల్లుడు హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. హుజూరాబాద్‌లో ఫలితాలు తారుమారైతే హరీశ్‌రావును వైఫల్యానికి బాధ్యుడిని చేయవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే దానిపై ఫలితాల తర్వాతనే స్పష్టత వస్తుంది. వందల కోట్లు ఖర్చు చేసినా గౌరవప్రదమైన మెజారిటీ దక్కని పక్షంలో గెలిచామని గొప్పగా చెప్పుకోలేరు. హుజూరాబాద్‌లో ఈటలపై తలపడుతున్నది కేసీఆర్‌ అన్న అభిప్రాయం ఉన్నందున రాజేందర్‌ ఒక్క ఓటు తేడాతో గెలిచినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓడిపోయినట్టేనన్న భావన ఏర్పడుతుంది. దళితబంధు పథకం హుజూరాబాద్‌లో మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్నది కూడా ఫలితం తర్వాత తెలుస్తుంది. దళితులకు పది లక్షల వంతున ఇస్తే తమకు లక్ష కూడా ఇవ్వరా అని బీసీలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు బహుజన్‌ సమాజ్‌ పార్టీని రాష్ట్రంలో నడిపిస్తున్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు దళితుల్లో మంచి పట్టు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కత్తులు దూస్తున్నందున దళిత యువత సహజంగానే కేసీఆర్‌ను వ్యతిరేకిస్తారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. ఏది ఏమైనా ఒక ఉపఎన్నికలో గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం క్షంతవ్యం కాదు. వ్యక్తుల మధ్య ఏర్పడిన పంతాలు–పట్టింపుల కారణంగా ఎన్నికలు ఇలా ఖరీదైన వ్యవహారంగా మారిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈటల, కేసీఆర్‌లలో ఎవరో ఒకరు గెలుస్తారు. ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోతుంది. ఓటేయడానికి డబ్బు డిమాండ్‌ చేయడమనేది ఒక హక్కుగా ప్రజలు భావించే పరిస్థితి కల్పించిన రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి. ఎవరిని కట్టడి చేయాలో వారిని కట్టడి చేయకుండా అమాయక ప్రజలపై కేసులు పెట్టాలనుకోవడం అవివేకమే అవుతుంది.


‘ఆంధ్రా’ మాటల లోగుట్టు!

ఈ విషయం అలా ఉంచితే, దళితబంధు వంటి పథకాలను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయ పార్టీని ప్రారంభించవలసిందిగా ఆ రాష్ట్ర ప్రజలు తనను కోరుతున్నారని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఫోన్లో కేంద్ర మంత్రులకు కూడా అందుబాటులోకి రాని కేసీఆర్‌ను ఆంధ్రప్రజలు ఎప్పుడు ఎలా కోరారో తెలియదు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి ఇరవై ఏళ్లయిన సందర్భంగా ఏర్పాటుచేశామని చెప్పుకొన్న ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఏప్రిల్‌ 27వ తేదీన పార్టీ ఆవిర్భావం జరిగింది. అయినా ఇప్పుడు ప్లీనరీ ఏర్పాటుచేయడం ఏమిటో అని టీఆర్‌ఎస్‌ నాయకులే అభిప్రాయపడ్డారు. ఆంధ్రాలో కూడా పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నట్టు కేసీఆర్‌ అన్నారో లేదో, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ‘కొత్తగా పార్టీ పెట్టడం ఎందుకు? మళ్లీ సమైక్య రాష్ట్రంగా ఉంటామని అసెంబ్లీలో తీర్మానించండి చాలు!’ అని చమత్కరించారు. మధ్యలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కల్పించుకొని ‘జగన్‌ రెడ్డి జైలుకెళితే ఉమ్మడి రాష్ర్టాన్ని ఏలాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నట్టుగా అగుపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణపై మళ్లీ ఆంధ్రావాళ్ల కుట్రలు అంటూ కేసీఆర్‌ తన పత్రికలో ఒక దిక్కుమాలిన కథనం వండి వార్చారు. తనకు కంట్లో నలుసుగా మారిన వారిని ఆంధ్రావాళ్లతో ముడిపెట్టడం కేసీఆర్‌కు అలవాటే కదా! వాస్తవానికి గొప్పలు చెప్పుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి రావాలని తనను కోరుతున్నారని కేసీఆర్‌ చెప్పుకొని ఉంటారు. తెలంగాణను దోచుకున్న ద్రోహులు అని నిందించిన ఆంధ్రావాళ్ల కోసం పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో కేసీఆర్‌కు తెలియదా? ఇంట్లో ఈగల మోత–బయట పల్లకీ మోత అన్నట్టుగా కేసీఆర్‌ ప్రకటనలు ఉంటాయి. ప్రజల్లో పట్టు సడలుతోందన్న అనుమానం కలిగినప్పుడు ఇలాంటి ప్రకటనల ద్వారా రాజకీయ నాయకులు సంతృప్తి చెందుతుంటారు. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా అండమాన్‌లో, తమిళనాడులో పార్టీ శాఖలు ఏర్పాటు చేయాలని తనపై ఒత్తిడి ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఆ మాట అన్నారంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని ఆయన భావిస్తున్నారా? గొప్పలు చెప్పుకొనే ముందు తెలంగాణలో తన పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. గురుశిష్యులైన కేసీఆర్‌, జగన్‌ రెడ్డి రాజ్యమేలుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అంత సంతృప్తిగా ఏమీ లేరు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇరువురు ముఖ్యమంత్రులూ ఆడుతున్న క్రీడ వల్ల ఉభయ రాష్ర్టాలూ ఆర్థికంగా చితికిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణ ప్రజల సగటు ఆదాయం ఎక్కువగా ఉందని, అది తన ఘనతేనని కేసీఆర్‌ చెబుతున్నారు గానీ వాస్తవానికి హైదరాబాద్‌ ప్రజల సగటు ఆదాయం మినహాయిస్తే మిగతా తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజల ఆదాయం అంతగా పెరగలేదు. రెండేళ్ల క్రితం పరస్పరం అతిథి మర్యాదలు చేసుకున్న కేసీఆర్‌–జగన్‌ రెడ్డి ఇప్పుడు నీటి పారుదల ప్రాజెక్టుల పేరిట గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తెలుగు ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ‘గోదావరి జలాలను ఉమ్మడిగా వాడుకుందాం–రాయలసీమను కోనసీమగా చేద్దాం’ అని ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడు అడ్డం తిరిగారు. దీంతో జగన్‌ రెడ్డి కూడా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. ఉభయ ప్రభుత్వాలూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీంతో పర్యావరణ అనుమతి పొందకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టకూడదని ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఫలితంగా ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మిగతా ప్రాజెక్టులు కూడా వివాదాస్పదం కావడంతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి కేంద్ర ఆర్థిక సంస్థలు ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులకు రుణ సహాయం చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఈ దుస్థితికి ఇరువురు ముఖ్యమంత్రులూ కారణం. తాము స్నేహంగా ఉంటూనే అనవసర వివాదాలను రేకెత్తించి తెలుగు రాష్ర్టాల ప్రయోజనాలకు గండి కొడుతున్నారు. రెండేళ్ల క్రితం ఉభయ రాష్ర్టాల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రులు, ఇప్పుడు కాసేపు కూర్చొని మాట్లాడుకోలేరా? ప్రాజెక్టుల విషయంలో లేనిపోని వివాదాలు సృష్టించిన ఇరువురు ముఖ్యమంత్రులూ రాజకీయంగా మాత్రం స్నేహంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి అధికారంలో ఉండాలని కేసీఆర్‌, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలో ఉండాలని జగన్‌ రెడ్డి కోరుకుంటున్నారు. ఈ ఇరువురికీ చెందిన మీడియాలో వచ్చే వార్తలు, వాటి ప్రాధాన్యతలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నీటి ప్రాజెక్టులు మూలనపడుతుంటే కేసీఆర్‌ గానీ, జగన్‌ గానీ కనీసం ఫోన్లో అయినా సంప్రదించుకోవడానికి ప్రయత్నించకపోవడంలో మర్మం ఏమిటి? సకల అనుమతులూ వచ్చిన తర్వాత మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టాలని అనుకుంటే జరిగే పనేనా? అయినా ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం ఎందుకు? నిధుల కొరతతో సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కూడా ఆగిపోయాయి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చునని రెండేళ్ల క్రితం గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రులకు ఇప్పడేమైంది? ధన బలంతో ప్రతిపక్షాలను అణచివేయాలని కేసీఆర్‌, అధికార బలంతో ప్రతిపక్షాన్ని తొక్కేయాలని జగన్‌ రెడ్డీ భావిస్తున్నారే గానీ రాష్ర్టానికి మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా? అని ఆలోచించడానికి వారికి తీరిక ఉండటం లేదు. నవరత్నాలు అంటూ డబ్బు పంపిణీ చేస్తూ రాజకీయంగా బలపడాలని జగన్‌ రెడ్డి, దళితబంధు వంటి భారీ వ్యయంతో కూడిన పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల్లో కోల్పోతున్న పరపతిని నిలబెట్టుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు గానీ రాష్ర్టాల ఆర్థిక స్థితి గురించి ఆలోచించడం లేదు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే క్రమంలో ‘ఆంధ్రా వాళ్లు నన్ను పిలుస్తున్నారు’ అని కేసీఆర్‌, ‘ఇంకెందుకు ఆలస్యం...కలిసుందాం రా!’ అని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని ప్రకటనలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఏడున్నరేళ్లు అవుతోంది. ఇప్పుడు కలయికలు ఏమిటి? ప్రజలను పిచ్చోళ్లు అనుకుంటున్నారేమో? ఆంధ్రా నాయకులకు ఇక్కడేం పని అని ఈసడించుకునే కేసీఆర్‌ అక్కడ తనకేం పని అని ఎందుకు ఆలోచించడం లేదో! నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ పార్టీ పెట్టినా ఎంతో కొంత మంది ఓట్లు వేయకపోరు. గతంలో ఆయన తిట్టిన తిట్లను మరచిపోయే ఉదార స్వభావం ఆంధ్రా వారికి లేకపోలేదు. తెలంగాణలో తాము పార్టీ పెడతామని జగన్‌ రెడ్డి అంటే కేసీఆర్‌ ఊరుకుంటారా? మళ్లీ చంద్రబాబు పెత్తనం వస్తుంది అని గత ఎన్నికల్లో ప్రజలను భయపెట్టే కదా కేసీఆర్‌ అధికారంలోకి వచ్చింది! మీడియా గానీ మరొకరు గానీ దాసోహం అనని పక్షంలో ‘ఆంధ్రా అనుకూలురు–తెలంగాణ ద్రోహులు’ అని ప్రచారం చేసి ఇప్పటిదాకా పబ్బం గడుపుకొంటూ వచ్చిన కేసీఆర్‌ ఇకపై తన పప్పులు ఉడకవని గ్రహించి ఉంటారు. ఒకవేళ ఆయన అదే భావనలో ఉంటే పప్పులో కాలేసినట్టే. పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టే విషయం అటుంచి తెలంగాణలో అడుగు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటే కేసీఆర్‌కే మంచిది. తాను మంత్రివర్గం నుంచి తొలగించిన ఒక వ్యక్తిని ఓడించడం కోసం అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందా అని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రగల్భాలు పలకడం కేసీఆర్‌కు అలవాటే. అయితే ఇప్పుడు ఆయన పలికే ప్రగల్భాలను నమ్మి మోసపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కేసీఆర్‌ బ్యాడ్‌లక్‌ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయన శిష్యుడైన జగన్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉధృతమవుతోంది. హుజూరాబాద్‌లో తేడా వస్తే కేసీఆర్‌ పరిస్థితి ఏమిటో చెప్పలేం. ముందుగా ఈ గండం నుంచి బయటపడకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పుకోవడం హాస్యాస్పదం అవుతుంది.

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more