వ్యూహకర్త వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-30T07:55:05+05:30 IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల గోవాలో మాట్లాడుతూ..

వ్యూహకర్త వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల గోవాలో మాట్లాడుతూ బీజేపీని పొగడటం, రాహుల్ గాంధీకి చురకలు అంటించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌లో చేరుతానంటూ రాహుల్ చుట్టూ తిరిగిన పెద్దమనిషి ఇప్పుడు ఇలా నోరుపారేసుకోవడంతో ఇద్దరి మధ్యా సయోధ్య చెడినట్టేనని అనేకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ను నాయకత్వస్థానంలో నిలబెట్టి బీజేపీకి వ్యతిరేకంగా నలుగురినీ కూడగట్టాలని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్‌కు రాహుల్ వైఖరి మరీ నిరాశ కలిగిస్తున్నదనీ, అందుకే ఘాటుగా మాట్లాడారనీ, అంతమాత్రాన వ్యవహారం చెడినట్టుకాదని మరికొందరు సర్దిచెబుతున్నారు.


పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భీకరయుద్ధం చేసి, బీజేపీ దూకుడును తట్టుకొని నిలచిన తృణమూల్ కాంగ్రెస్, ఆ విజయోత్సాహంలో భాగంగా గోవాలో కాలూనిన విషయం తెలిసిందే. గోవా మాజీ ముఖ్యమంత్రి రాకతో ఆరంభమైన చేరికలు ఇప్పుడు క్రీడాకారుడు లియాండర్ పేస్ వరకూ విస్తరించింది. సార్వత్రిక ఎన్నికల్లోగా తృణమూల్‌ని జాతీయస్థాయి పార్టీ అనిపించడం మమతకు కావాలి. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు, మేమే అన్న రీతిలో తృణమూల్ నాయకులు మాట్లాడుతున్న తరుణంలోనే, ఆ పార్టీ వ్యూహకర్త, మమతకు ఆప్తుడూ అయిన ప్రశాంత్ కిశోర్ ఈ విమర్శలు చేశారు. భారత రాజకీయాల్లో బీజేపీ దానంతటదే చెరిగిపోదనీ, నాలుగైదుదశాబ్దాలు దాని ప్రభావం నిక్షేపంగా ఉంటుందనీ, మోదీనీ బీజేపీనీ ప్రజలే విసిరిపారేస్తారన్న ఆలోచన సరైనది కాదని కిశోర్ అన్నారు.  స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ కొన్ని దశాబ్దాలు నిలిచినట్టే, ఇకపై బీజేపీ ఉంటుందనీ, మోదీ కూడా బలంగా ఉన్నారనీ చేసిన విశ్లేషణల్లో అవాస్తవాలేమీ లేవు. ఇదే మాట అమిత్ షా ఎప్పుడో చెప్పారనీ, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ కూడా ఒప్పుకున్నారని బీజేపీ నాయకులు వరుస ట్వీట్లతో వేడుక చేసుకున్నారు. ప్రజలే కూల్చేస్తారనుకుంటూ నిమ్మకునీరెత్తినట్టు ఉంటే విపక్షాలు ఎన్నటికీ అధికారంలోకి రావన్నది కిశోర్ భావన. నరేంద్రమోదీ బలం తెలుసుకోవడం, అర్థంచేసుకోవడం, ఆయన పాపులారిటీకి గల కారణాలను గుర్తించడం ద్వారా మాత్రమే ఆయన ఓటమికి మార్గం తెలుసుకోవచ్చునని కిశోర్ అంటున్నారు. ఈ మాటలన్నీ మమతని ఆకాశానికి ఎత్తడానికీ, ఆమె ఒక్కరే పోరాడుతున్నట్టుగా చిత్రీకరించడానికీ కిశోర్ అన్నారని కొందరి భావన. గతనెల భవానీపూర్ ఉపఎన్నికకు ముందు బీహార్ నుంచి ఆయన బెంగాల్‌కు తన ఓటును బదలాయించుకున్నప్పుడే కాంగ్రెస్‌తో తెగిపోయిందన్నారు. కానీ, ప్రశాంత్ కిశోర్ పెద్దగా ఆచితూచిమాట్లాడే మనిషి కాదు. బెంగాల్ ఎన్నికల మధ్యన ఆయన మోదీ దేశవ్యాప్తంగా పాపులర్ అన్నమాటలను బీజేపీ బాగా వాడుకుంది. కానీ, బీజేపీకి బెంగాల్‌లో వందసీట్లు కూడా రావన్నది ఆ తరువాత నిజమైంది.


యూపీ, గోవా, పంజాబ్ ఎన్నికలు ముగిసిన తరువాతే ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రవేశం గురించి ఆలోచించాలని కాంగ్రెస్ అనుకోవడం, అందుకు ఆయన కూడా సరేననడం తెలిసిందే. అది జరిగినా లేకున్నా, బీజేపీ భక్తుడని ఆడిపోసుకోవడం కంటే ఆయన  చేసిన వ్యాఖ్యలను సానుకూలంగా స్వీకరించడం కాంగ్రెస్ కు కచ్చితంగా ఉపకరిస్తుంది. పంజాబ్ లో కెప్టెన్ ను మార్చి దళితుడిని కూచోబెట్టి మంచి నిర్ణయం చేశారని సంతోషించేలోగా సిద్దూ దానినంతా నీరుగార్చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ వంటివి కాస్తంత దూకుడుగా నడుస్తుంటే కాంగ్రెస్ లో అటువంటి వైఖరి కనిపించడం లేదు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీసీసీ అధ్యక్షులతోనూ, ఏఐసీసీ కార్యదర్శులనూ ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాలకోసం పాకులాడి పార్టీని దెబ్బతీయవద్దన్నారు. పార్టీ ఆశయాలు, ఆదర్శాలూ ప్రజలందరికీ చేరాలన్నారు. ౨014 నుంచి పార్టీ ప్రాభవం దిగజారిపోవడం వెనుక అధినాయకత్వం పాత్ర ఏమీ లేదన్న రీతిలో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. కశ్మీర్ సహా చాలా అంశాల్లో ఆ పార్టీ ఏ ఆదర్శానికి కట్టుబడిందో ఎవరికీ అర్థంకాదు. కార్యకర్తల బలం బాగా ఉన్న బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రజాబలాన్ని ఎలా పెంచుకోవాలని అనుకుంటున్నదో తెలియదు. ప్రత్యక్షపోరాటాలు లేకుండా ట్విట్టర్ వార్ కు పరిమితమైతే మోదీని గద్దెదించాలన్న లక్ష్యం నెరవేరదని కాంగ్రెస్ గుర్తించడం అవసరం.

Read more