మలుపు తిప్పే గెలుపు

ABN , First Publish Date - 2021-11-03T06:04:30+05:30 IST

ఫలితాలు వచ్చాయి కదా, ఇక వ్యాఖ్యానాలు మొదలు. గెలిచినవారు ఆర్భాటం చేయడం సహజమే కానీ, ఓడిపోయినవారు కూడా ఊరుకోరు. ఓటమిని చిన్నది చేయాలని చూస్తారు....

మలుపు తిప్పే గెలుపు

ఫలితాలు వచ్చాయి కదా, ఇక వ్యాఖ్యానాలు మొదలు. గెలిచినవారు ఆర్భాటం చేయడం సహజమే కానీ, ఓడిపోయినవారు కూడా ఊరుకోరు. ఓటమిని చిన్నది చేయాలని చూస్తారు. ఒక్కసీటు పోతే ఏమయింది అంటారు. ప్రత్యర్థులందరూ చేతులు కలిపి దెబ్బ తీశారంటారు. నైతిక విజయం మాత్రం తమదే అంటారు. మొత్తానికి కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తున్నా, సత్యాన్ని స్వీకరించలేరు. తీసుకోవలసిన పాఠం తీసుకోరు. పతనపు పాకుడు రాళ్ల మీద అడుగువేసిన తరువాత ఇక అంతే, జారడమే, ఆగడం ఉండదు. 


తెలంగాణ రాష్ట్రంలో సంచలనాత్మకంగా జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, అధికార, ధన ‘బాహుబలి’ మీద ‘బలహీనుడి’ గెలుపుతో ముగిసింది. కొవిడ్ కల్లోల కాలంలో అత్యంత కీలకమయిన ఆరోగ్యశాఖను నిర్వహిస్తూ ఉండిన ఈటల రాజేందర్‌ను అవమానకరంగా మంత్రివర్గం నుంచి తొలగించి, ఆయన మీద అకస్మాత్తుగా పుట్టుకువచ్చిన ఆరోపణలపై ఆగమేఘాల మీద విచారణలు నిర్వహించి, ఊపిరాడనివ్వకుండా చేసినదానికి పర్యవసానంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక అవసరమయింది. టిఆర్ఎస్ నుంచి, శాసనసభ్యత్వం నుంచి తప్పుకున్న తరువాత, ఈటల రాజేందర్ భారతీయ జనతాపార్టీలో చేరి, ఉపఎన్నికపై కేంద్రీకరించారు. ఏదో ఒక్క స్థానమే కదా, అని అధికారపార్టీ ఊరుకోలేదు. అక్కడ జరుగుతున్నది తమ అధినేతకూ, ఈటలకూ మధ్య యుద్ధమన్న అభిప్రాయం కలిగించింది. వందలకోట్ల పార్టీధనాన్ని, వేలకోట్ల ప్రభుత్వ ధనాన్ని అక్కడ గుమ్మరించారు. అసమ్మతికి గుణపాఠం చెప్పాలని అనుకున్నారో, తాను ఏ నియోజకవర్గంలోనైనా గెలవగలనని అనుకున్నారో కానీ, ముఖ్యమంత్రి చాలా పంతానికి పోయారు. ఫలితంగా, హుజూరాబాద్‌లో ఫలితం ఎట్లా ఉండబోతుందోనని ఉత్కంఠ పెరిగింది. పోటాపోటీగా, హోరాహోరీగా ఉన్నదని చెప్పినవారు కూడా, ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్ఠ ప్రభావశీలంగా ఉన్నదని, ఎవరు గెలిచినా తక్కువ అంతరం మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ, 23 వేలకు పైగా తేడాతో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. 


గత ఎన్నికలలో 66 వేలకు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి దయనీయమైన సంఖ్యలో ఓట్లు పొందింది. కాంగ్రెస్ ఓట్లు కూడా ఈటలకు మళ్లాయన్నది కనిపిస్తున్న వాస్తవం. పోయినసారి నామమాత్రపు ఓట్లు మాత్రమే తెచ్చుకున్న భారతీయ జనతాపార్టీ, ఈ సారి లక్షకు పైగా సాధించడానికి అభ్యర్థి బలమే తప్ప పార్టీ బలం కాదన్నది వాస్తవమే. అయితే, బలమైన ప్రత్యర్థిని నిలువరించి విజయం సాధించడానికి ఈటల రాజేందర్‌కు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు దోహదం చేశారు. ఇప్పుడు, గతంలో జరిగిన పరిణామాలను సమీక్షించుకుంటే, ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షణ పొందడానికి ఈటల రాజేందర్ భారతీయ జనతాపార్టీని ఆశ్రయించడం అనాలోచిత నిర్ణయంకాదని అనిపిస్తుంది. ఆ పార్టీలో రాజేందర్ ప్రయాణం ఏ రీతిగా సాగుతుందో మున్ముందు చూడాలి. అన్యాయం జరిగిందని ప్రజలు స్పష్టంగా గుర్తించిన చోట, వందల వేల కోట్లు కుమ్మరించినా ఫలితం ఉండబోదని హుజూరాబాద్ ఉపఎన్నిక నిరూపించింది. రాజకీయ సంస్థలలో అంతర్గత ప్రజాస్వామ్యం, పరిపాలనలో సమష్టి భాగస్వామ్యం వంటి విలువలను పక్కనబెట్టి, ఏకస్వామ్యం చెలాయించాలనుకుంటే, డబ్బుతో దేనినైనా కొనగలమనుకుంటే, అది చెల్లుబాటు కాదని ఈ ఎన్నిక సంకేతాత్మకంగా అయినా ప్రకటించింది. రాజేందర్ గెలుపువల్ల, బాధలను దిగమింగుకునేవారు, పెదవులను కుట్టేసుకున్నవారు కొత్త చైతన్యాన్ని పొందవచ్చు. 


తెలంగాణలో మాత్రమే కాదు, యావద్దేశంలో కూడా అధికారపీఠాలకు ఈ ఉప ఎన్నికలు గట్టి పాఠాన్నే చెప్పబూనాయి. మూడు లోక్‌సభ స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికలలో, ఈశాన్యంలో మినహా భారతీయజనతాపార్టీకి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నాలుగింటికి నాలుగు అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకుంది. వాటిలో రెండు మునుపు భారతీయజనతాపార్టీ స్థానాలు. భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న హిమాచల ప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలను, ఒక లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో, ఒకస్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. అది బిజెపి చేతిలో ఉండిన సీటు. తాను అధికారంలో ఉన్న రాజస్థాన్లో రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. వాటిలో ఒకటి బీజేపీది. ఈ నియోజకవర్గాలలో భారతీయ జనతాపార్టీ మూడవ, నాల్గవ స్థానంలో నిలిచింది. శివసేన మొదటి సారిగా మహారాష్ట్రకు వెలుపల దాద్రానగర్ హవేలీలో లోక్ సభ స్థానం గెలుచుకుంది. మధ్యప్రదేశ్, బిహార్, అస్సాం, మేఘాలయలలో మాత్రం ఎన్‌డిఎ పక్షాలు మంచి ఫలితాలు సాధించాయి. హుజూరాబాద్‌లోను, వైసిపి ఘనవిజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు లోను కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండినా, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందించేట్టు ఉన్నాయి. అధికార బిజెపికి పరిస్థితులు నల్లేరు మీద నడకలాగా లేవన్న సూచనలను ఈ ఉప ఎన్నికల ఫలితాలు అందిస్తున్నాయి. 


ప్రజల మనోగతాన్ని ఎన్నికల ఫలితాలు ఎంతో కొంత ప్రతిఫలిస్తాయి. మార్పునకు సానుకూల పరిస్థితి ఉన్నదని గ్రహించిన రాజకీయ శక్తులు, అందుకు అనుగుణమైన వ్యూహరచన చేసి మార్పును వేగవంతం చేయాలి. తెలంగాణలో అయినా, జాతీయ స్థాయిలో అయినా ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది.

Read more