మిర్చినష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించాలి!

ABN , First Publish Date - 2021-12-29T09:03:28+05:30 IST

దేశంలో మిర్చి ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో ఏపీ తర్వాత స్థానం తెలంగాణాదే. గత ఏడాది క్వింటాలు ధర పదివేలకు పైగా పలకడంతో మిర్చిసాగు గిట్టుబాటు అవుతుందని భావించి ఎక్కువమంది రైతులు ఈ ఏడాది..

మిర్చినష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించాలి!

దేశంలో మిర్చి ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో ఏపీ తర్వాత స్థానం తెలంగాణాదే. గత ఏడాది క్వింటాలు ధర పదివేలకు పైగా పలకడంతో మిర్చిసాగు గిట్టుబాటు అవుతుందని భావించి ఎక్కువమంది రైతులు ఈ ఏడాది మిర్చిపంట వైపు మొగ్గు చూపారు. 3,58,557 ఎకరాలలో మిర్చి వేశారు. కానీ, వారి ఆశ అడియాస అయింది. గతంలో ఎప్పుడూ లేని తెగుళ్లు చీడ పీడలు మిర్చి పంటను చుట్టుముట్టాయి. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన తామరనల్లి పురుగు అమెరికా నుండి వ్యాప్తి చెంది కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకు విస్తరించి మిర్చి పంటను దారుణంగా నష్ట పరిచింది. దీనికితోడు తెల్లదోమ, రసం పీల్చే పురుగు, పచ్చపురుగు, ఎండు తెగులు, నారుకుళ్ళు తెగులు తదితర చీడపీడలన్నీ తోడయ్యాయి. ఈ ఏడాది ఎక్కువ రోజులు కురిసిన వర్షాలతో భూమిలో తేమ ఆరకపోవటం, వాతావరణ మార్పులతో ఈ సారి తెగుళ్ల తీవ్రత ఎక్కువగా వుంది. 90శాతం మిర్చి తెగుళ్ళ బారినపడింది. మిర్చి తోటలు నిలువునా ఎండిపోయాయి. 50శాతం తోటలను రైతులు పీకి వేయడం లేదా వదిలివేయడం చేశారు. మిర్చి సాగుపై ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా దూద్య తండాలో ఆంగోత్ బిక్కు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలరోజుల కాలంలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఆరుగురు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకొన్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.  మిగతా పంటలకంటే మిర్చి సాగుకు పెట్టుబడి, కష్టం చాలా ఎక్కువ. గిట్టుబాటవుతుందనే ఆశతో అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంవత్సరం మిర్చి వేసిన రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏడాది మిర్చి పంటకు జరిగిన నష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించాలి.

గౌని ఐలయ్య, 

ఎఐకెఎమ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2021-12-29T09:03:28+05:30 IST