తర్కంలేని సుప్రీం తీర్పు

ABN , First Publish Date - 2021-11-18T09:05:48+05:30 IST

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యురో నివేదిక ప్రకారం 2019, 2020 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాలు 9.4శాతం, ఎస్టీలపై 9.3శాతం పెరుగుదల నమోదైంది....

తర్కంలేని సుప్రీం తీర్పు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యురో నివేదిక ప్రకారం 2019, 2020 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాలు 9.4శాతం, ఎస్టీలపై 9.3శాతం పెరుగుదల నమోదైంది. ఇది కేవలం అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని, రానివ్వని సంఘటనలు కోకొల్లలు. చట్టాలతో ఈ అకృత్యాలు ఆగుతాయి అనుకోవటం సరికాదు. ఎన్నో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ కులం పేరుతో జరిగే దాడులను అరికట్టలేకపోతున్నాయి. వాటి అమలులో అనేక సందర్భాల్లో యంత్రాంగం వైఫల్యం ప్రస్ఫుటమవుతుంది. పరిస్థితి ఇలా ఉండగా, గత నెలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సివిల్ నేరమైతే ఎస్సీ ఎస్టీ చట్ట విచారణను నిలిపివేయవచ్చునని తీర్పు ఇచ్చింది. దేశంలో కులం పేరుతో జరిగిన దాడులలో, హత్యలలో సివిల్ తగాలతో మొదలైనవే ఎక్కువ. అవి మూకుమ్మడి మారణహోమాలకు కూడా దారితీశాయి. నాటి కారంచేడు, లక్ష్మింపేట, ఖైర్లాంజి మొదలు గత వారం గుజరాత్ కచ్ జిల్లాలోని ఒక గ్రామంలో రామాలయంలోకి వచ్చారని దళితులపై దాడి చేయటం వరకు అధిక శాతం సంఘటనల వెనక భూ తగాదాలు కారణాలుగా ఉన్నాయనేది ఒక కోణం. ఎస్సీ ఎస్టీ భూములు అన్యాక్రాంతం కావడానికి ప్రధాన కారణం సమాజంలో వారి సామాజిక స్థాయి అట్టడుగున ఉండటమే. ఇది అంతర్లీనంగా కులవివక్షలో భాగం కాకుండా పోదు. ఈ తర్కంలేని తీర్పును సుప్రీం కోర్టు పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వైరుధ్యాలు లేని సమాజం నిర్మితం కావాలంటే మనుషుల మస్తిష్కాలను ప్రభావితం చేస్తున్న అశాస్త్రీయ మత భావనలను నశింపజేయాలి. రాజ్యాంగం నిర్దేశించినట్లుగా శాస్త్రీయ వైఖరులతో కూడిన వైజ్ఞానిక దృక్పథం పెంపొందించబడాలి. ఈ దిశగా పెను ఉప్పెన లాంటి జాతీయ స్థాయి ఉద్యమం జరిగి తీరాలి. 

పి.ఆర్.కె 

నవయాన బుద్ధిస్ట్ సొసైటీ

Read more