పార్లమెంట్‌లో ప్రాణభయం..!

ABN , First Publish Date - 2021-12-16T06:07:25+05:30 IST

భారత పార్లమెంట్‌పై 13 డిసెంబర్, 2001న తీవ్రవాదుల దాడి జరిగింది. ఆ దారుణ ఘటనకు 20 ఏళ్ళు నిండాయి. పార్లమెంట్ సభ్యునిగా నేను అప్పుడు అక్కడే ఉన్నాను...

పార్లమెంట్‌లో ప్రాణభయం..!

భారత పార్లమెంట్‌పై 13 డిసెంబర్, 2001న తీవ్రవాదుల దాడి జరిగింది. ఆ దారుణ ఘటనకు 20 ఏళ్ళు నిండాయి. పార్లమెంట్ సభ్యునిగా నేను అప్పుడు అక్కడే ఉన్నాను. ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. పార్లమెంట్ భవనానికి అతి దగ్గరలో మీనాబాగ్‌లో మా నివాసం ఉండేది. ఆరోజు సమావేశాలకు ఇంటి దగ్గర నుండి కాలినడకనే వెళ్ళాను. ఉదయం అల్పాహారం కూడా ఎందుకనో తీసుకోలేదు. 11 గంటలకు మొదలైన లోక్‌సభ 10 నిమిషాల్లోనే వాయిదా పడింది. రాజ్యసభ కూడా దాదాపు అంతే. ఇంటికి వచ్చేద్దామనుకునేలోగా రామానాయుడు తదితర సహచర తెలుగుదేశం సభ్యులు టీ తాగి వెళదామన్నారు. అందుకనే పార్లమెంట్ హౌస్‌లోనే ఉన్న పార్టీ కార్యాలయంలో కూర్చుని పిచ్చాపాటి చర్చలు సాగించాం. కళా వెంకటరావు తనకు పని ఉందని మధ్యలో బయటకు వెళ్లారు. కాసేపటికి శబ్దాలు వినబడితే దగ్గరలో ఏదో పెళ్లి జరుగుతోందేమో అనుకున్నాం. ఇంతలో బయటకు వెళ్లిన కళా వెంకటరావు పరుగున వచ్చి, తీవ్రవాదుల దాడి జరుగుతున్నట్లు చెప్పారు. అందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎంతమంది, ఎన్ని ఆయుధాలతో వచ్చారో ఎవరికీ తెలియదు. అప్పటికే పార్లమెంట్ తలుపులన్నీ మూసేశారు, కానీ ఆలోగానే ఎవరైనా లోపలికి చొరబడ్డారా లేదా అన్నది తెలియదు. కాసేపటికి ఎనౌన్స్‌మెంట్ వచ్చింది ‘అందరూ సెంట్రల్ హాల్‌కి వచ్చేయం’డని. దీంతో మంత్రులతో సహా వందకిపైగా సభ్యులం అక్కడకు చేరుకున్నాం. నా చేతిలో ఫోన్ ఉంది. ఇంటికి చేశాను, జరుగుతున్నందంతా టీవీలో చూడమని, భయపడొద్దని. నేను మాత్రం ఇక ఏమైతే అది అవుతుందిలే అన్న భావనలో ఉండిపోయాను. అక్కడ గంటా శ్రీనివాసరావు, ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా నా ఫోనే వాడినట్టు గుర్తు. కాసేపు పోయాక ప్రమోద్ మహాజన్ లేచి ‘బయట ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారో తెలియదు. ఎవరైనా ఆత్మాహుతి దాడికి లోపలికి చొరబడ్డారేమో చెప్పలేము. నిబ్బరంగా ఉందాం, ఎంతసేపైనా అందరం ఇక్కడే ఉందాం, ఏం జరుగుతోందనే క్లారిటీ వచ్చేవరకూ ఏమీ చెప్పలేం?’ అని అందరికీ చెప్పారు. కొంత నిశ్శబ్దం.. మధ్య మధ్య బాంబు పేలుళ్ల శబ్దాల మధ్య అలాగే ఉండిపోయాం. దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో అందరినీ క్యూలో బయటకు తీసుకువచ్చి బస్సెక్కించారు సిబ్బంది. ఇంటికొచ్చాక బయట ఏం జరిగిందీ, మాకోసం ఎంతమంది సిబ్బంది ప్రాణాలర్పించినదీ తెలిసింది. రాత్రివరకూ అడపాదడపా శబ్దాలు ఇంటివరకూ వినిపిస్తూనే ఉన్నాయి. తరువాత రోజు పార్లమెంట్ సమావేశమై అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించింది. ఆ రోజు మాకోసం ప్రాణాలర్పించిన 9 మంది రక్షక సిబ్బందికి మాలో ప్రతీ ఒక్కరూ జీవితకాలం ఋణపడి ఉన్నట్టే. 

డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ పార్వతీపురం

Updated Date - 2021-12-16T06:07:25+05:30 IST