ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలపైనే దృష్టి

ABN , First Publish Date - 2021-02-26T09:55:36+05:30 IST

లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత మార్కెట్లో కొత్త వ్యూహాన్ని అవలంబించడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టి పెట్టనుంది. 2020లో లగ్జరీ కార్ల విక్రయాలపై

ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలపైనే దృష్టి

త్వరలో దేశీ మార్కెట్లోకి ఈ-ట్రాన్‌ ఎస్‌యూవీ.. 2021లో రెండంకెల వృద్ధి అంచనా

ఆడి ఇండియా అధిపతి బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత మార్కెట్లో కొత్త వ్యూహాన్ని అవలంబించడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టి పెట్టనుంది. 2020లో లగ్జరీ కార్ల విక్రయాలపై కొవిడ్‌ ప్రభావం ఉందని.. అయితే.. 2021లో అమ్మకాలు పెరిగే వీలుందని ఆడి ఇండియా అఽధిపతి బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ చెబుతున్నారు. ఇప్పటికీ భారత్‌లో మొత్తం ప్రయాణ వాహనాల విక్రయాల్లో లగ్జరీ కార్ల వాటా ఒక శాతం కంటే తక్కువేనని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌లో కంపెనీ వ్యూహం ఏమైనా మారిందా?

భారత్‌లో ఇప్పటి వరకూ పెట్రోల్‌ కార్ల వ్యూహాన్ని అనుసరించాం. ఇక ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టి పెడతాం. ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వ్యాపారం, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నాం.


కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయ్‌?

గత ఐదు నెలల్లో ప్రతి నెల.. అంతక్రితం నెలతో పోలిస్తే విక్రయాలు పెరుగుతున్నాయి. డిసెంబరులో నెలవారీ విక్రయాలు అత్యధికంగా ఉన్నాయి. 2021లో కూడా ఇదే విధంగా గిరాకీ కొనసాగుతుందని భావిస్తున్నాం. మొత్తం పరిశ్రమను పరిగణనలోకి తీసుకుంటే.. గత ఏడాది విక్రయాలపై కొవిడ్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపిం ది. దేశీయ ప్రయాణ వాహనాల విక్రయాల్లో లగ్జరీ కార్ల విక్రయాలు ఒక శాతం కన్నా తక్కువే.. 2021లో అమ్మకాలు కొద్దిగా ఆశావహంగా ఉండగలవని భావిస్తున్నాం. 


2021లో ఆడి ఎన్ని మోడళ్లను విడుదల చేయనుంది?

ఇప్పటి వరకూ ఉన్న విభాగాల్లో కొత్త కార్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. సెడాన్ల నుంచి ఎస్‌యూవీల వరకూ కొత్త కార్లను విడుదల చేస్తాం. 2021 అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నాం. ఎక్కువగా విక్రయం అవుతున్న మోడళ్లలో ఒకటైన ఆడి ఏ4 వాహనం విక్రయాలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయని భావిస్తున్నాం.  


మెట్రోయేతర పట్టణాల్లో విక్రయాలు ఎలా ఉన్నాయ్‌?

ఆడి కార్ల విక్రయాల్లో సగానికి సగం మెట్రోయేతర పట్టణాల్లో జరుగుతున్నాయి. కొత్త మార్కెట్లలోకి విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి.


డిజిటిలీకరణలో ఆడి వ్యూహం?  

ఆడి కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపే వారిలో 18-20 శాతం మంది డిజిటల్‌ చానెళ్ల ద్వారానే సమాచారం తెలుసుకుంటున్నారు. కంపెనీ అనుసరిస్తున్న ‘స్ట్రాటజీ 2025’లో డిజిటిలీకరణ ఒక మూలస్తంభం. ‘మై ఆడి కనెక్ట్‌’ యాప్‌లో భద్రత, డ్రైవర్‌ వ్యవహార శైలి, జీయో లొకేషన్‌ మొదలైన అన్ని రకాల సేవలు పొందడానికి వీలుంది. అగ్‌మెంటెడ్‌ రియాల్టీ టెక్నాలజీ ద్వారా కస్టమర్లు ఇంట్లో ఉండే షోరూమ్‌కు వచ్చి కారును చూసిన అనుభూతి పొందే వీలు కల్పిస్తున్నాం. 


భారత్‌లో ఈ-ట్రాన్‌ కారు విడుదల ఎప్పుడు?

త్వరలోనే లగ్జరీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఆడి ఈ-ట్రాన్‌ను విడుదల చేయాలని భావిస్తున్నాం. ఇందులో సమగ్ర చార్జింగ్‌ ఆప్షన్లు, ఇంటలిజెంట్‌ సొల్యూషన్లు ఉంటాయి.

Updated Date - 2021-02-26T09:55:36+05:30 IST