ఐటీ రిటర్నుల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-21T05:53:34+05:30 IST

ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేయాల్సిన రిటర్నుల గడువును..

ఐటీ రిటర్నుల గడువు పొడిగింపు

సెప్టెంబరు 30 వరకు అవకాశం 


న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేయాల్సిన రిటర్నుల గడువును సెప్టెంబరు 30 వరకు, కంపెనీలు, వ్యాపార సంస్థలు సమర్పించాల్సిన రిటర్నుల గడువును నవంబరు నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఏటా జూలై 31లోగా, కంపెనీలు, వ్యాపార సంస్థలు అక్టోబరు నెలాఖరులోగా తమ పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది.


కొవిడ్‌-19 రెండో దశ ఉధృతి నేపథ్యంలో పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు సీబీడీటీ తెలిపింది. అలాగే కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫారం-16 గడువును జూలై 15 వరకు పొడిగించారు. 2020-21 ఆర్థిక సంత్సరానికి సవరించిన లేదా ఆలస్యంగా ఫైల్‌ చేస్తే అనుమతించే రిటర్నుల గడువునీ ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నుంచి వచ్చే ఏడాది జనవరి నెలాఖరు వరకు పొడిగించారు. 


ఈ-ఫైలింగ్‌ కోసం కొత్త వెబ్‌సైట్‌

ఐటీ రిటర్నుల ఈ-ఫైలింగ్‌ కోసం జూన్‌ 7వ తేదీన కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభానికి ఆరు రోజుల ముందు నుంచి ప్రస్తుత వెబ్‌సైట్‌ బ్లాకౌట్‌ పీరియడ్‌లో ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా క్లోజ్‌ చేస్తారు. ఈ విషయాన్ని దృష్టి లో ఉంచుకుని పన్ను చెల్లింపుదారులు ఏమైనా సమస్యలు ఉంటే జూన్‌ 1 వ తేదీలోపే ప్రస్తుత వెబ్‌సైట్‌ ద్వారా తమ సమస్యలు తెలపాలని సీబీడీటీ కోరింది. కాగా పలు అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. 

Updated Date - 2021-05-21T05:53:34+05:30 IST