రాజధానిలో ఎక్కడుంది రహస్యం!?

ABN , First Publish Date - 2021-01-20T07:56:39+05:30 IST

రాజధాని అమరావతిని అటకెక్కించేందుకు సర్కారు పెద్దలు తీసుకొచ్చిన ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ వాదన ఉత్తిదే అని తేలిపోయింది! రాజధాని నిర్ణయంలో రహస్యమేదీ లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది

రాజధానిలో ఎక్కడుంది రహస్యం!?

ప్రపంచం మొత్తం తెలిశాక ‘ఇన్‌సైడర్‌’ ఇంకెక్కడ?

హైకోర్టు సూటి ప్రశ్న..  ‘ఇన్‌సైడర్‌’ వాదనలు కొట్టివేత

రాజధాని అమరావతిపై హైకోర్టు సంచలన తీర్పు

ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రాంతంపై ప్రకటన

ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు, కథనాలు

ఆస్తులు సమకూర్చుకోవడం రాజ్యాంగబద్ధ హక్కు

భూములు కొనడం నేరం, మోసం ఎలా అవుతుంది?

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కంపెనీలకు సంబంధించినది

ఐపీసీ సెక్షన్లతో దానికి సంబంధమే లేదు

పిటిషనర్లపై సీఐడీ కేసు చెల్లనే చెల్లదు: హైకోర్టు


అందరికీ తెలిసిందే!

రాజధాని ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో వస్తూనే  ఉన్నాయి. ఇది కేవలం కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు మాత్రమే తెలిసిన ‘రహస్య సమాచారం’ కాదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాజధాని ప్రాంతం గురించిన ప్రకటన వెలువడింది. అందువల్ల... పిటిషనర్లు మరేదో మార్గంలో ఈ సమాచారం పొందారని, భూవిక్రేతలకు రాజధానికి సంబంధించిన సమాచారం తెలియదని ఎంతమాత్రం భావించలేం. పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా ఈ విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు. ఈ కథనాలను ‘ప్రాసిక్యూషన్‌’ కూడా తోసిపుచ్చలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం రహస్యం కాదని... ప్రజలకు తెలుస్తూనే ఉందనేందుకు ఇవి తిరుగులేని ఆధారాలు.


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. వర్తించదు

కంపెనీల అంతర్గత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వాటి షేర్లు, బాండ్ల ‘ట్రేడింగ్‌’ చేయడం చట్ట విరుద్ధం. దీనినే  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇది పూర్తిగా కంపెనీలు, షేర్‌ మార్కెట్లకు సంబంధించిన విషయం. భూములు, ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలకు దీంతో సంబంధమే లేదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో ఐపీసీ నిబంధనలకు సంబంధమే లేదు. పిటిషనర్లకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వర్తింపజేయడం తప్పు.


ఆస్తి... అందరి హక్కు

ఆస్తి హక్కు... రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఇది చట్టబద్ధమైన హక్కు.  దీని ప్రకారం దేశంలోని పౌరులు ఎవరైనా, ఎక్కడైనా భూములను కొనుగోలు చేయవచ్చు. ఆస్తులు సమకూర్చుకోవడం నేరం కానేకాదు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారంటూ క్రిమినల్‌ లా కింద చర్యలు తీసుకోలేరు. ప్రైవేటు భూలావాదేవీలు ఎలా నేరపూరితమవుతాయో... భూమిని కొన్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుని, వారిని ప్రాసిక్యూట్‌ చేయడం ఏమిటో కోర్టు అవగాహనకు అందడంలేదు.

- హైకోర్టు

కొనుగోలుదారులపై కేసులు డేంజర్‌!

‘భూమి కొన్న తర్వాత దాని విలువ పెరిగింది’... అంటూ కొనుగోలుదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం అంటే ప్రమాదకర ధోరణికి తెరలేపినట్లే. తాము అమ్మిన భూమి ధర భారీగా పెరిగితే... కొనుగోలుదారులను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ కేసులో పిటిషనర్లను ఏదో ఒకరకంగా ప్రాసిక్యూట్‌ చేసేందుకు ఒక గుడ్డి ప్రయత్నం జరిగిందని  చెప్పవచ్చు. ఇది ఊహాజనితమైన కారణాలతో ప్రభుత్వం చేపట్టిన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌. నేరం జరిగినట్లు  దర్యాప్తులోనూ  తేలలేదు. హరియాణ ప్రభుత్వం వర్సెస్‌ భజన్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ కేసుకూ వర్తిస్తాయి. సుప్రీం తీర్పు ప్రకారం పిటిషనర్లపై కేసు పెట్టడం చెల్లదు.

- హైకోర్టు

అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పిన ప్రకారమే... 2014 సెప్టెంబరు 1వ తేదీన రాజధాని ప్రాంతంపై మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆ మరుసటి రోజునే అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ఈ వివరాలు మొత్తం మీడియాలో వచ్చాయి. రాజధాని ప్రాంతంలో పిటిషనర్లు మాత్రమే  కాదు... అనేక మంది భూములు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారి అందించిన సమాచారంలోనే స్పష్టంగా ఉంది. 

-హైకోర్టు


అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని  అటకెక్కించేందుకు సర్కారు పెద్దలు తీసుకొచ్చిన ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ వాదన  ఉత్తిదే అని తేలిపోయింది! రాజధాని నిర్ణయంలో రహస్యమేదీ లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎక్కడ రాజధాని వస్తోందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తూనే ఉందని మీడియా కథనాలు ప్రచురితమైన తేదీలతో సహా వెల్లడించింది. ఆస్తులు సమకూర్చుకోవడం పౌరుల హక్కు అని, అది నేరం, మోసం ఎలా అవుతుందని నిలదీసింది. ‘అమ్మిన తర్వాత భూముల ధర పెరిగింది’ అంటూ కొనుగోలుదారులపై కేసులు పెట్టడం ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ ద్వారా భూములు కొన్నారంటూ వివిధ సెక్షన్ల కింద ఆరుగురిపై సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ సంచలన తీర్పు చెప్పారు.


భూములు కొనుగోలు చేసిన పిటిషనర్లను ప్రాసిక్యూట్‌ చేయడానికి, భూలావాదేవీలకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వర్తింపచేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేర న్యాయశాస్త్రానికి (క్రిమినల్‌ జ్యూరి్‌సపుడెన్స్‌)కి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ తెలియని విషయమని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌తో పాటు పోలీసులు జరిపిన దర్యాప్తులో సైతం పిటిషనర్లు నేరానికి పాల్పడినట్లు స్పష్టం కాలేదని తెలిపింది. భజన్‌ లాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లపై నమోదు చేసిన కేసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.


ఇదీ కేసు...

రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతం గురించి అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకొని, అమరావతి చుట్టుపక్కల కొంతమంది భూములు కొనుగోలు చేశారని వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్‌ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారంగా చేసుకొని నార్త్‌ ఫేస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరె క్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరావు, సీహెచ్‌ తేజస్వీ, లలితా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వెర్టెక్స్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గాయత్రి రియల్టర్స్‌, గుడ్‌ లైఫ్‌ ఎస్టేట్స్‌, కిలారు రాజేశ్‌, కె.శ్రీహాస తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, జి.సుబ్బారావు, ప్రణతి వాదనలు వినిపించారు. రాజధాని ఏర్పాటు విషయంలో రహస్యమేదీ లేదంటూ దీనికి సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మీడియా కథనాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీనిపై 87 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది.


ఏ సెక్షన్‌ ఎందుకు చెల్లదు!

భూములు కొన్నారంటూ సీఐడీ నమోదు చేసిన ఒక్కో సెక్షన్‌ ఎందుకు చెల్లదో కోర్టు వివరంగా చెప్పింది. అందులోని ముఖ్యాంశాలు...


మోసం కాదు..

భూమిని ఎందుకు కొంటున్నాం, కొన్న తర్వాత ఏం చేస్తాం అనేది విక్రయదారుడికి చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ నేపథ్యంలో పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచారని భావించలేం. ఆ లావాదేవీల వల్ల విక్రయదారుడికి జరిగిన నష్టం ఏమీ లేదు. అందువల్ల... దీనిని ఐపీసీ 420 కింద మోసంగా పరిగణించలేం.


దుర్వినియోగం లేదు..

పిటిషనర్లకు ఎవరూ భూములు అప్పగించలేదు. వాటి దుర్వినియోగం కూడా జరగలేదు. అందువల్ల సెక్షన్‌ 415 ఐపీసీ వర్తించదు.


కుట్ర లేదు..

ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన చట్టబద్ధమైన ఒప్పందంలో నేరపూరిత కుట్ర ఏముంది? 120-బి ఐపీసీ (నేరపూరిత కుట్ర) వర్తించదు.


విశ్వాస  ఘాతుకమూ లేదు..

ఈ కేసులో ‘బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ (విశ్వాస ఘాతుకం) వర్తించదు. 406 ఐపీసీ కింద నేరం జరగలేదు.


ఏజెంట్లు, మర్చెంట్లూ కాదు...

బ్యాంకర్‌, మర్చంట్‌, పబ్లిక్‌ సర్వెంట్‌ లేదా ఏజెంట్‌లు తమకు అప్పగించిన ఆస్తిని దుర్వినియోగం చేస్తే ఐపీసీ 409 సెక్షన్‌ వర్తిస్తుంది. ఇక్కడ భూములు కొన్న వారు వీరెవరూ కాదు.


మూడో  వ్యక్తికేం సంబంధం?

భూములు అమ్మి మేం నష్టపోయామని వాటి యజమానులెవరూ ఇన్ని రోజుల్లో చెప్పలేదు. ‘ఇక్కడ రాజధాని వస్తుంది’ అనే సమాచారం దాచిపెట్టి భూములు కొన్నారని ఫిర్యాదు చేయలేదు. అమ్మిన వాళ్లూ, కొన్నవాళ్లూ ఒక చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. పిటిషనర్లు తమ కుటుంబ, వ్యాపార అవసరాల కోసం భూములు కొన్నారు. నిజంగా తమకు నష్టం జరిగిందని భావిస్తే... ఆరేళ్ల క్రితమే తాము మోసపోయామని కేసులు పెట్టేవారు. ఇప్పుడు... ఇన్నేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్‌ వారు చూపిస్తున్న  విక్రేతల వాంగ్మూలాలను వాస్తవాలకు దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే... ‘మా భూములు అమ్ముతాం’ అని విక్రేతలే స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.  ఈ లావాదేవీలతో ఏమాత్రం సంబంధంలేని, మూడో వ్యక్తి ఎవరో దీనిపై ఫిర్యాదు చేశారు.  


ఎప్పటికప్పుడు ఇలా...

‘‘కృష్ణా-గుంటూరు జిల్లాల పరిధిలో... కృష్ణా నదీ తీరం వెంబడి రాజధాని వస్తుందనే విషయాన్ని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుసుకున్నారు. 2014 జూన్‌ - డిసెంబరు మధ్య భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని రాజధాని ప్రాంతంలో, మరికొన్ని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అవతల ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని వస్తోందనే విషయాన్ని రైతుల వద్ద దాచిపెట్టి మోసం చేశారు’’ అని పిటిషనర్లపై కేసు పెట్టారు. కానీ... రాజధాని విషయంలో రహస్యమే లేదని హైకోర్టు స్పష్టం చేసింది.  ఎప్పటికప్పుడు ప్రజలందరికీ  దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తూనే  ఉందంటూ పత్రికా కథనాలను ప్రస్తావించింది.అవేమిటంటే...

2014 జూన్‌ 9: ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే... కృష్ణా-గుంటూరు జిల్లాల్లో, కృష్ణా నదీ తీరం వెంబడి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయం అన్ని ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. 

2014 జూన్‌ 10: ‘ఏపీ కేపిటల్‌ నియర్‌ గుంటూరు, నాయుడు సేస్‌ హి వాంట్స్‌ కేపిటల్‌ బిట్వీన్‌ గుంటూరు-విజయవాడ’ (గుంటూరు సమీపంలో ఏపీ రాజధాని.. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు’ అనే శీర్షికన ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ‘‘ఇది అధికారికమే! ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వస్తుందని, అది హైదరాబాద్‌ నగరంలాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు’’ అని అందులో తెలిపారు.

2014 జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భౌగోళికంగా నడిమధ్యలో, అందరికీ సమాన  దూరంలో ఉన్నందునే విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

2014 జూలై 7 (ఈనాడు): కృష్ణా నది తీరం వెంబడి ‘అమరావతి’ కేంద్రంగా కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని అనుసంధానిస్తూ కొత్తగా భారీ వంతెనలు నిర్మిస్తారు.

2014 జూలై 2 (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా): నాటి శాతవాహనుల రాజధాని ‘అమరావతి’ చుట్టూ ఆంధ్ర ప్రదేశ్‌ కొత్త రాజధాని ఏర్పాటు కానుంది.

2014 జూలై 23 (సాక్షి): కొత్త రాజధానికి సరైన ప్రాంతం కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యనే అని, అక్కడే రాజధాని వస్తుందని సలహా కమిటీ అధ్యక్షుడు (నాటి మంత్రి) నారాయణ ప్రకటించారు. ఢిల్లీలో శివరామకృష్ణన్‌ కమిటీని కలిసి ఈ విషయం వెల్లడించారు.

2014 సెప్టెంబరు 24 (ఈనాడు): కొత్త రాజధాని చుట్టూ ఒక రింగ్‌ రోడ్డు వస్తుంది.  రాజధానికి 30వేల ఎకరాలు అవసరమవుతాయి. (ఇదే  కథనంలో ‘పుత్రజయ’ నగర చిత్రాన్ని కూడా ప్రచురించారు)

2014 సెప్టెంబరు 5 (ఎకనమిక్‌ టైమ్స్‌): విజయవాడ ప్రాంతంలోనే కొత్త రాజధాని వస్తుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

2014 అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధాని వస్తుంది. భూసమీకరణ విధానంలో రైతుల నుంచి 30వేల ఎకరాలు సమీకరించాలని భావిస్తున్నారు.

2014 అక్టోబరు 30 (ఎకనమిక్‌ టైమ్స్‌): రాజధానిపై కొన్ని నెలలుగా ఉన్న సస్పెన్స్‌కు  తెరపడింది.ఆంధ్రపద్రేశ్‌కు ‘రివర్‌ ఫ్రంట్‌’ రాజధాని రానుంది. కృష్ణా నదికి దక్షిణాన గుంటూరు జిల్లాలోని 17 గ్రామాల పరిధిలో రాజధాని వస్తుంది.  (ఆయా గ్రామాల పేర్లు కూడా ప్రచురించింది.)

2014 అక్టోబరు 31: చంద్రబాబు కలలు కంటున్న ‘రివర్‌ఫ్రంట్‌ రాజధాని’ నిర్మాణంపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమై.. ల్యాండ్‌ పూలింగ్‌ చేయాల్సిన 17 గ్రామాలను గుర్తించింది.

Updated Date - 2021-01-20T07:56:39+05:30 IST