నీడ..మంచినీరు లేదు

ABN , First Publish Date - 2021-02-27T04:45:11+05:30 IST

క్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రూ.1,84,812.94 లక్షల విలువ గల 43,950 పనులు పూర్తయ్యా

నీడ..మంచినీరు లేదు
పనుల మధ్యలో ఎండ వేడిమికి భారీ వృక్షం కింద సేదతీరుతున్న కూలీలు




మెడికల్‌ కిట్లు లేవు

‘ఉపాధి’ పని ప్రదేశాల్లో వసతులు కరువు

వేతనదారులకు ఇక్కట్లు

వేసవి సమీపిస్తుండడంతో ఆందోళన

(జియ్యమ్మవలస)

-ఎండలు ముదురుతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ‘ఉపాధి’ పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సదుపాయంతో పాటు ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. వేతనదారులే ఇళ్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రథమ చికిత్స కిట్ల జాడే లేదు. అధికారులను అడుగుతుంటే ప్రభుత్వం నుంచి సరఫరా లేదని తప్పించుకుంటున్నారు. ఫలితంగా వేతనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

‘పనిచేసే చోట నీడ, తాగేందుకు నీరు, అత్యవసర, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మెడికల్‌ కిట్లు’..ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కాలం ఏదైనా ఉపాధి పనులు చేస్తున్నప్పుడు వీటన్నింటిని తప్పనిసరి చేశారు. కానీ వాటి సరఫరాను మాత్రం మరిచారు. ఫలితంగా వేతనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడే తమ వెంట నీటిని తెచ్చుకుంటున్నారు. పని మధ్యలో నీరు అయిపోయినా దాహంతోనే గడుపుతున్నారు. ఇంటికి వెళ్లి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడం, వేసవి సమీపిస్తుండడంతో వేతనదారులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.  

జిల్లాలోని 34 మండలాల్లో 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  మొత్తం 2,915 గ్రామాల్లో 44,686 శ్రమశక్తి సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ గ్రూపులు) ఉండగా... 8.19 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగాను జిల్లాలో 45,868 పనులు చేసేందుకు నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం రూ. 2,69,151.36 లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రూ.1,84,812.94 లక్షల విలువ గల 43,950 పనులు పూర్తయ్యాయి. పనులైతే చేస్తున్నారు తప్ప వేతనదారులకు సౌకర్యాలు కొరవడుతున్నాయి. ఎండ దాటికి తట్టుకోలేక పని మధ్యలో చెట్టునీడకు ఆశ్రయించాల్సి వస్తోంది. దాహార్తిని తీర్చేందుకు తాగునీరు సైతం ఏర్పాటు చేయడం లేదు. పని ప్రదేశంలో ఎవరైనా గాయపడితే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. వేసవి సమీపిస్తుండడం, వడగాలులు ప్రారంభంకానున్న నేపథ్యంలో వసతులు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. పని ప్రదేశాల్లో నీడకల్పించే షామియానాలు, తాగునీరు, మెడికల్‌ కిట్లు అందుబాటులోకి తేవాలని వేతనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ప్రభుత్వం నుంచి సరఫరా లేదు

పని ప్రదేశాల్లో షామియానా, తాగునీరు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ప్రభుత్వం నుంచి వాటి సరఫరా నిలిచిపోయింది. గతంలో ఇచ్చినవి ఉపయోగించుకోవాలని క్షేత్ర సహాయకులు, మేట్లుకు తెలియజేశాం. ఒక వేళ టెంట్లు లేకపోతే పందిళ్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం.

-లక్ష్మి, అడిషనల్‌ పీడీ, విజయనగరం



Updated Date - 2021-02-27T04:45:11+05:30 IST