సర్కారు స్థలంపై అక్రమార్కుల కన్ను!

ABN , First Publish Date - 2021-12-31T06:15:23+05:30 IST

పెందుర్తి మండల రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు పక్కా ప్లాన్‌తో స్కెచ్‌ వేస్తున్నారు.

సర్కారు స్థలంపై అక్రమార్కుల కన్ను!
సరిపల్లిలోని ప్రభుత్వ స్థలం

సరిపల్లిలో 35 సెంట్ల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు తప్పుడు పత్రాలతో యత్నాలు

రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు

పెందుర్తి, డిసెంబరు 30: పెందుర్తి మండల రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు పక్కా ప్లాన్‌తో స్కెచ్‌ వేస్తున్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి సర్కారు స్థలాల స్వాహాకు పాల్పడుతున్నారు. పెందుర్తి మండలంలో సరిపల్లిలో సర్వే నంబర్‌-262-2లో సుమారు 35 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు అక్రమార్కులు సిద్ధపడినట్టు తెలిసింది. ఈ స్థలానికి పక్కనున్న జిరాయితీ స్థలం నంబర్‌ వేసి తప్పుడు పత్రాలతో దీనిని కూడా జిరాయితీగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా ఈ స్థలం స్థానిక  ధర్మకోనేరులో  అంతర్భాగంగా ఉండేది. అయితే ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం వృద్ధి చెందడంతో కోనేరు సమీపంలోని వ్యవసాయ భూములు లేఅవుట్లుగా రూపాంతరం చెందాయి. ఈ స్థలాలకు రూ.కోట్లలో విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను లేఅవుట్‌ పక్కన ఖాళీగా వున్న కోనేరు స్థలంపై పడింది. అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు దీనికి సూత్రధారి అని తెలిసింది. అందువల్లో రెవెన్యూ సిబ్బంది చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ స్థలానికి సంబంధించి తమవద్ద పత్రాలున్నాయని కొంతమంది పనులు నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఈ స్థలం ఆక్రమణకు గురవ్వడంతో రెవెన్యూ అఽధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే వాటిని ఆక్రమణదారులు మాయం చేసేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే విలువైన ఈ స్థలం చేజారిపోయే ప్రమాదముందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ స్థల ఆక్రమణపై ఇప్పటికే స్థానికులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్‌ పి.రామారావు మాట్లాడుతూ కోనేరు స్థలంపై సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసి పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు.


Updated Date - 2021-12-31T06:15:23+05:30 IST