మరణాల్లో రికార్డుల మోత

ABN , First Publish Date - 2021-05-21T09:18:49+05:30 IST

రాష్ట్రంలో కరోనా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు నమోదవుతున్నాయి

మరణాల్లో రికార్డుల మోత

రాష్ట్రంలో 24 గంటల్లో 114 మంది మృతి

ఇన్ని మరణాలు ఇదే తొలిసారి

15 లక్షలు దాటిన కరోనా కేసులు

కొత్తగా 22,610 మందికి పాజిటివ్‌

బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

విశాఖలో 6, గుంటూరులో 2 కేసులు

సత్తెనపల్లిలో ఎరువుల వ్యాపారి మృతి


అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కేసులు కూడా 15 లక్షల మార్కుని దాటిపోయాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 114 మంది కరోనాకు బలయ్యారని.. 1,01,281 శాంపిల్స్‌ను పరీక్షించగా 22,610 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య  15,21,142కి, మొత్తం మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా కలకలం మొదలైన తర్వాత ఒకరోజు వ్యవధిలో 114 మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఈనెల 17న రాష్ట్రంలో అత్యధికంగా 109 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఈ రికార్డు కూడా మరుగున పడిపోయింది. తాజాగా పశ్చిమగోదావరిలో 17 మంది కరోనాతో మరణించగా.. చిత్తూరులో 15, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం పది మంది చొప్పున, అనంతపురం, విజయనగరంలో తొమ్మిది మంది చొప్పున, కృష్ణాలో 8, కర్నూలులో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, శ్రీకాకుళంలో 5, కడపలో ఇద్దరు చొప్పున చనిపోయారు.


తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా 3,602 మందికి వైరస్‌ సోకగా.. చిత్తూరులో 3,185, పశ్చిమగోదావరిలో 2,066, విశాఖపట్నంలో 1,984, అనంతపురంలో 1,794, గుంటూరులో 1,584, ప్రకాశంలో 1,523, శ్రీకాకుళంలో 1,517, నెల్లూరులో 1,219, కర్నూలులో 1,178 కేసులు బయటపడ్డాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 15,21,142 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 13,02,208 మంది కోలుకున్నారు. ఒకరోజు వ్యవధిలో కొత్తగా 23,098 మంది వైరస్‌ బారినుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,134 యాక్టివ్‌ కేసులున్నాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు (వైసీపీ) కరోనా బారిన పడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు బుధవారం ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది.


విశాఖలో ఆరు, గంటూరులో 2 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ అలజడి కొనసాగుతూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లాలో మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బటయపడగా.. సత్తెనపల్లిలో ఎరువుల వ్యాపారి బ్లాక్‌ ఫంగస్‌తో మృతిచెందారు. విశాఖలో మరో ఆరు కేసులను వైద్యులు నిర్ధారించారు. విశాఖ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో కేజీహెచ్‌కు రాగా.. వైద్యులు పరీక్షించి నిర్ధారణ చేశారు. కడప జిల్లాలో ముగ్గురిలో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. రాయచోటికి చెందిన 35 ఏళ్ల మహిళ, చిట్వేలి మండలానికి చెందిన 60 ఏళ్ల మహిళ, కడపకు చెందిన ఓ యువకుడిలో అనుమానిత లక్షణాలున్నాయి.

Updated Date - 2021-05-21T09:18:49+05:30 IST