ఉత్తుత్తి సర్వే!

ABN , First Publish Date - 2021-05-20T09:29:40+05:30 IST

ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లాలి... వివరాలు సేకరించి జ్వరపీడితుల్ని గుర్తించాలి... ఆరోగ్య శాఖ యాప్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేయాలి... రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా కరోనా కట్టడికి జరగాల్సిన ఇంటింటి సర్వే ఇది. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. ఏఎన్‌ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ

ఉత్తుత్తి సర్వే!

ఇంటింటికీ వెళ్లకుండానే ‘జ్వరం’ లెక్కలు 

ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు చెప్పిందే ఫైనల్‌

ఇంట్లో కూర్చునే యాప్‌లో సమాచారం అప్‌డేట్‌ 

వీటి ఆధారంగానే ఆరోగ్య శాఖ నివేదిక

ఫీల్డ్‌కు వెళ్లని డాక్టర్లు, హెల్త్‌ సూపర్‌ వైజర్లు

వెలుగులోకి రాని వాస్తవ లెక్కలు

రెండు విడతల్లో జరిగిన సర్వేలో ఇదే తంతు 

ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లపై పనిభారం 

హోం ఐసొలేషన్‌, వ్యాక్సినేషన్‌ బాధ్యతా వారికే 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లాలి... వివరాలు సేకరించి జ్వరపీడితుల్ని గుర్తించాలి... ఆరోగ్య శాఖ యాప్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేయాలి... రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా కరోనా కట్టడికి జరగాల్సిన ఇంటింటి సర్వే ఇది. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. ఏఎన్‌ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఇంటింటికి వచ్చి సమాచారం  అడిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచిన యాప్‌లో మాత్రం అన్ని విధాలుగా సమాచారం అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకూ సర్వే ఇలాగే జరిగింది. అంటే రాష్ట్రంలో ఉత్తుత్తి సర్వే జరుగుతోందన్న మాట. ఇప్పటి వరకూ రెండు విడతల సర్వే పూర్తి అయింది. మూడో విడత సర్వేకు ఆరోగ్యశాఖ సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన సర్వేలో యాప్‌లో రెండు రోజుల్లో 80 శాతం, మూడు రోజుల్లో 95 శాతం పూర్తి అయినట్లు సమాచారం వచ్చేస్తుంది.


బుధవారం ఉదయం నాటికి 1.63 కోట్ల కుటుంబాలకు గాను 1.31 కోట్ల కుటుంబాలకు సర్వే పూర్తి అయింది. దాదాపు 80.06 శాతం సర్వేను పూర్తి చేసినట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 0.43 శాతం అంటే 56,907 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 11,258 మంది జ్వరపీడితుల్ని గుర్తించారు. అనంతపురంలో అత్యల్పంగా 3134 మంది జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్క రోజే 13 జిల్లాల్లో 17.03 లక్షల కుటుంబాలకు సర్వే చేయగా 7975 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 


క్షేత్రస్థాయిలో తనిఖీలు ఏవీ? 

సర్వేపై క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసే అధికారులు ఉండటం లేదు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన సమాచారం ఆధారంగానే ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తోంది. ఇందులో ఎంత వరకూ వాస్తవం అన్నది మాత్రం ఎవ్వరూ పర్యవేక్షించడం లేదు. నిబంధనల ప్రకారం ఏఎన్‌ఎంలు, ఆశాలు ఇంటింటి సర్వే చేసిన తర్వాత పీహెచ్‌సీ డాక్టర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు.. క్షేత్రస్థాయిలో ర్యాండమ్‌గా పరిశీలించాలి. అప్పుడు ఏఎన్‌ఎం ఇచ్చిన సమాచారం వాస్తవమా కాదా అన్నది తేలుతుంది. ఆరోగ్యశాఖ సర్వే ప్రారంభించిన తర్వాత డాక్టర్లు, సూపర్‌వైజర్లు ఫీల్డ్‌కు వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి హోం ఐసోలేషన్స్‌ కిట్స్‌ అందడం లేదు. వారు ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షలు చేయించుకుని, ఆర్‌ఎంపీల వద్ద మందులు తీసుకుని వాడుకుంటున్నారు. 


ఏఎన్‌ఎంలు, ఆశాలపై పని ఒత్తిడి 

సర్వే వల్ల ప్రజలకు, ఆరోగ్యశాఖకు ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లపై పనిభారం పెరుగుతోంది. ప్రస్తుత కొవిడ్‌ అత్యవసర పరిస్థితుల్లో ఏఎన్‌ఎంలు, ఆశాలు రోజువారీ విఽధులు నిలిచిపోయాయి.  వ్యాక్సినేషన్‌ మినహా మిగిలిన అన్ని బాధ్యతలను ఆరోగ్యశాఖ ఆపివేసింది. ప్రస్తుతం మొత్తం ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనాపైనే పని చేస్తున్నారు. కరోనాపై పోరాటంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లది కీలకమైన బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 80 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరందరి ఆరోగ్యాన్ని ప్రతి రోజు సమీక్షించే బాధ్యత ఏఎన్‌ఎంలకు అప్పగించారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలి. వారికి అవసరమైన మందులు అందించాలి. ఇది కాకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. దీనికి తోడు ఇప్పుడు ఫీవర్‌ సర్వే చేయాలి. ఎవరైనా జ్వరం వచ్చిన వారుంటే వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలి. ఇదే సమయంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి సమస్య వస్తే ఆస్పత్రుల్లో బెడ్‌ సిద్ధం చేయాలి. అంబులెన్స్‌లను పిలిపించి కరోనా బాధితుల్ని ఆస్పత్రులకు తరలించాలి. ఇదంతా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు చేయాల్సిన పని. 


ఇంటి వద్దే వివరాల సేకరణ 

ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లపై పని ఒత్తిడి ఉన్నా వారిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫీవర్‌ సర్వే అంటూ కొత్త భారాన్ని మోపారు. దీంతో ఏఎన్‌ఎంలు చేసేది లేక ఇంటి వద్దనో లేక పీహెచ్‌సీలోనో కూర్చుని ఎవరైనా తమ వద్దకు జ్వరం అని వస్తేనో లేదా జ్వరం వచ్చింది ఏం చేయాలని ఎవరైనా ఫోన్‌ చేస్తే వారి సమాచారం తీసుకుని ఆ డేటాను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. లేకపోతే ఆశా వర్కర్‌కు ఫోన్‌ చేసి ఇద్దరు ముగ్గురు సమాచారం తీసుకుని అప్‌లోడ్‌ చేస్తున్నారు. కానీ ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న దాఖలు లేవు. 

Updated Date - 2021-05-20T09:29:40+05:30 IST