తిరుగుబాటు తప్పదు

ABN , First Publish Date - 2021-12-31T08:25:40+05:30 IST

తిరుగుబాటు తప్పదు

తిరుగుబాటు తప్పదు

ప్రజలపై భారాలు మోపుతున్న సర్కారు

ప్రజలు ఎదురు తిరిగే రోజు వస్తుంది

‘అమూల్‌’ లాభాలు గుజరాత్‌కు తరలింపు

ఒత్తిడితో పాలు పోయించడం దారుణం

హోదా విషయంలో బీజేపీ మాట తప్పింది

సీపీఎంను ప్రత్యామ్నాయంగా మారుస్తాం

ఆ పార్టీ నూతన కార్యదర్శి శ్రీనివాసరావు 


అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చెప్పారు. పార్టీ రాష్ట్ర మహాసభలు తాడేపల్లిలో మూడు రోజులు జరిగిన విషయం తెలిసిందే. మహాసభల తీర్మానాలపై రాష్ట్ర నూతన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి పి.మధు గురువారం విజయవాడలో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, వాటిపై పోరాటం చేసేందుకు పార్టీ ఏం చేయాలన్న అంశాలపై మహాసభల్లో చర్చించినట్లు వి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అభివృద్ధి, రైతాంగం సంక్షోభం ముఖ్యమైనవన్నారు. రైతులకు, యువతకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. చెత్తపన్ను, విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతాంగ ఉద్యమాలు బలోపేతమయ్యాయని, వారందరినీ కలుపుకుని బలమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్రజాబాహుళ్యంతో కూడిన బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఉద్యమాలకు బలమైన కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ నాయకులు ఎందుకు మాట తప్పారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీజేపీ చీప్‌ లిక్కర్‌ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఛీప్‌ రాజకీయాలతో బీజేపీ నాయకులు ఎక్కువ కాలం మోసం చేయలేరని, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుకుంటుంటే, బీజేపీ ప్రభుత్వం మాత్రం విశాఖ స్టీల్‌ ప్లాట్‌ను అమ్మేస్తామని చెప్పడం దారుణమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీని నిలువరించకపోతే రాష్ట్రాన్ని కూడా మూసేస్తుందని మండిపడ్డారు. బీజేపీ నైజం అర్థం చేసుకుని రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ పోరాటాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో సహకార డెయిరీలు మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు. అమూల్‌ రావడం మంచిదే అయినా, సహకార డెయిరీల ఊసురు తీయవద్దని కోరారు. లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రైతుల దగ్గర నుంచి పాలు సేకరిస్తున్న అమూల్‌ 3-4 నెలల పాటు బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో విచక్షణా రహితంగా అమూల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి బలవంతంగా పాలు పోయాలని రైతులు, రైతు కూలీలపై ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. సహకార డెయిరీలను ఆదుకోవాలంటే వారికి నిధులు లేదా అప్పులు ఇచ్చి సహాయం చేయాలని, దీనికి అమూల్‌ సాంకేతిక సహకారం తీసుకోవాలని సూచించారు. అమూల్‌ కంపెనీ లాభాలు మొత్తం గుజరాత్‌కు తరలిస్తోందని మండిపడ్డారు. ఒమైక్రాన్‌ మళ్లీ విజృంభిస్తుందని, రాష్ట్రంలో ఆస్పత్రులు మొత్తం అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు బీజేపీ మాదిరిగానే ఉన్నాయన్నారు. కాగా, ధాన్యానికి సరైన ధర రాక విజయనగరంలో రైతులు రోడ్డుపై  ధాన్యం పోసి తగలబెడుతున్నారని మాజీ కార్యదర్శి మధు అన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధర  లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, 17 ఏళ్ల క్రితం నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ అమలవుతున్నాయని తెలిపారు. కర్ణాటకలో రూ.12 వేలుంటే, మన రాష్ట్రంలో ఐదు వేలు మాత్రమే ఉందన్నారు. కనీస వేతన సలహా బోర్డును ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తమ పార్టీ కోరినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అంథకారమైందని ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-12-31T08:25:40+05:30 IST