ఆస్తి పన్ను పెంపునకు కౌన్సిల్‌ ఆమోదం

ABN , First Publish Date - 2021-07-24T06:21:17+05:30 IST

గిద్దలూరు ఆస్తి పన్ను పెంపునకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

ఆస్తి పన్ను పెంపునకు కౌన్సిల్‌ ఆమోదం
కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుపుతున్న టీడీపీ కౌన్సిలర్లు చంద్రశేఖర్‌యాదవ్‌, బిల్లా జయలక్ష్మి


గిద్దలూరు నగర పంచాయతీ తీర్మానం

కరోనా కాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పన్నుల పెంపు తగదు

సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కౌన్సిలర్లు


గిద్దలూరు టౌన్‌, జూలై 23 : ఆస్తి పన్ను పెంపునకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో ఇళ్లకు సంబంధించి ఆస్తి పన్ను పెంపునకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వం పన్నులు పెంచడం శోచనీయమంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. 2002లో ఆస్తి పన్నును, 2007లో నివాసేతర స్థలాలకు ఆస్తి పన్ను పెంచారని, ఆ తరువాత ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపుదల చేయలేదని చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్నుపై 15 శాతం మించకుండా పన్ను విధింపుకు నిర్ధేశించినట్లు తెలిపారు. 375 చ.అ. గృహాలకు రూ.50 మాత్రమే పన్ను విధిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంతో  ప్రస్తుతం పన్ను చెల్లింపు ధరలపై భారం పడే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి కష్టాలను పట్టించుకోకపోగా పన్నుల పేరిట అధిక మొత్తంలో  పిండుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని టీడీపీ కౌన్సిలర్లు బూనబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌, పాలుగుళ్ల శ్రీదేవి, బిల్లా జయలక్ష్మి ప్రకటించారు. సమావేశం నుంచి వారు బయటకు వెళ్లి పన్నులు పెంచే విధానాన్ని మానుకోవాలని నినాదాలు చేశారు. సామాన్యుడు నడ్డి విరిచే విధంగా పన్నులు అధిక మొత్తంలో విధించడం సబబు కాదన్నారు.  సమావేశంలో వైస్‌చైర్మన్‌ ఆర్‌డీ రామక్రిష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ రామక్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:21:17+05:30 IST