అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు

ABN , First Publish Date - 2021-02-27T05:20:38+05:30 IST

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ అరిమంద విజయశారద రెడ్డి హెచ్చరించారు.

అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు
మాట్లాడుతున్న విజయశారద రెడ్డి

విద్య పర్యవేక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ విజయశారద రెడ్డి


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), ఫిబ్రవరి 26 : ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ అరిమంద విజయశారద రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో శుక్రవారం కమిటీ సభ్యులు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆర్‌ఐవో కార్యాలయంలో విలేకర్లతో విజయ శారద మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు దారుణ స్థితిలో బోధన అందిస్తున్నాయని, ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి 70 శాతం ఫీజులు మాత్రమే కట్టించుకోవాలని ప్రభుత్వం సూచిస్తే నిబంధనలు పాటించకుండా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. తాము పరిశీలించిన అంశాలపై నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ప్రైవేటు కళాశాలల్లో సమస్యలు ఉంటే 9150381111 నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:20:38+05:30 IST