ఆర్టీసీ కండక్టర్‌కు వీఎంసీలో డిప్యుటేషన్
ABN , First Publish Date - 2021-12-19T07:00:56+05:30 IST
ఆర్టీసీ కండక్టర్‌కు వీఎంసీలో డిప్యుటేషన్
అభ్యంతరం తెలిపిన టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికారపక్షం యాగీ
సాంబశివరావును సస్పెండ్ చేసిన మేయర్
వన్‌టౌన్, డిసెంబరు 18: ఆర్టీసీ మహిళా కండక్టర్ నాగలక్ష్మి తనకు డిప్యుటేషన్‌పై నగరపాలక సంస్థలో పనిచేసేందుకు అనుమతివ్వాలని చేసుకున్న దరఖాస్తును నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదించడం గొడవకు దారితీసింది. నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కౌన్సిల్ హాలులో శనివారం నిర్వహించారు. ప్రధాన అజెండాలోని 11వ అంశం..కార్యాలయం సూచనలను ఆమోదించడమైనది అని తీర్మానం చేయడంపై 4వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు అభ్యంతరం తెలిపారు.
‘తాను అనారోగ్య కారణాల వల్ల కండక్టర్‌గా పనిచేయలేక పోతున్నానని, తనను నగరపాలక సంస్థలో డిప్యుటేషన్‌పై నియమించాలని నాగలక్ష్మి దరఖాస్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందున నిబంధనల మేరకు ఉద్యోగికి 56 సంవత్సరాలు నిండిన తర్వాత మెడికల్ సర్టిఫికెట్ పొందాకే డిప్యుటేషన్‌కు అవకాశముంటుందని పేర్కొంటూ.. ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న టైం స్కేల్‌కు సమానంగా ఉన్న పోస్టులో నియమించవచ్చునని.. ఇందుకు 010 పద్దు మేరకు ఫారిన్ సర్వీస్ కింద నియామకం కొరకు ఆర్టీసీ అధికారుల నుంచి డ్యూటీ సర్టిఫికెట్ తెచ్చుకుంటే నియామకం చేయవచ్చు’ అని కార్యాలయం నోట్‌లో పేర్కొన్నారు. దీనిని ఆమోదించాక జాస్తి సాంబశివరావు లేచి ఆర్టీసీలో ఉద్యోగం చేయలేని ఆమె నగరపాలక సంస్థలో ఏ విధంగా పనిచేస్తుందని అనుకుంటున్నారు. ఆమెను మేయర్ పక్కన, కమిషనర్ పక్కన సీటు వేసి కూర్చోబెడతారా అని ప్రశ్నించారు.
జాస్తి వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కమిషనర్
ఈ క్రమంలో మరికొన్ని తీర్మానాలు చదివాక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడారు. సీనియర్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. దీంతో వైసీసీ సభ్యులు లేచి కమిషనర్‌కు మద్దతుగా నిలిచారు. టీడీపీ వారికి ఆడవారిని గౌరవించడం తెలియదు.. కించ పరచడమే తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికే మహిళల పట్ల గౌరవం లేదని, అదే తరహాలో ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా మాట్లాడుతున్నారని సభలో ఉన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్‌కు మంత్రి సూచించారు. దీంతో సాంబశివరావు జోక్యం చేసుకుని తాను చేసిన వ్యాఖ్యలకు కమిషనర్ బాధపడి ఉంటే తాను దానికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే వైసీపీ సభ్యులు, మేయర్ స్పందిస్తూ.. తమకూ క్షమాపణలు చెప్పాలంటూ గొడవకు దిగారు. ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సమయంలో సాంబశివరావును సభ నుంచి సస్పెండ్ చేస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కమిషనర్, మేయర్ ఇద్దరికీ సాంబశివరావు క్షమాపణ లేఖలు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని అందులో స్పష్టం చేశారు. మంత్రి వెలంపల్లి మహిళలను ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడితే క్షమించేది లేదని కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి హెచ్చరించారు.
నేను ఎవరినీ కించపరచలేదు: జాస్తి సాంబశివరావు
నాగలక్ష్మి డిప్యుటేషన్‌పై ప్రశ్నించానే తప్ప ఎవరినీ కించపరచే మాటలు మాట్లాడలేదు. వీఎంసీ పునరావాస కేంద్రంగా మారకూడదన్న ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశాను..తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు. కమిషనర్ బాధపడితే క్షమాపణ చెబుతాను. జనరల్ నిఽధులు వ్యయం చేయడంపైన, చెత్తపన్ను వసూలపైనా చర్చించాలని కోరాం. దాన్ని తప్పుదారి పట్టించేందుకే నాపై నిందలు వేస్తున్నారు.