ఆ రోజులు మళ్లీ రావాలి

ABN , First Publish Date - 2021-12-26T05:53:58+05:30 IST

ఆ రోజులు మళ్లీ రావాలి

ఆ రోజులు మళ్లీ రావాలి
జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులను సత్కరిస్తున్న పలువురు న్యాయమూర్తులు

నగరంలో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ

సీజేఐ దంపతులకు ఘనంగా పౌరసన్మానం

ఒకప్పుడు విజయవాడలో ఆనందదాయకమైన అభ్యుదయం ఉండేది. కళలు, సాంస్కృతిక, పత్రికారంగాలకు చైతన్య పీఠిక బెజవాడ. ఆనాటి రోజులు ఇప్పుడు కనిపించడం లేదు. నేను ప్రాక్టీస్‌ చేస్తున్న రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఎంతో బాధపడ్డాను. ఆనాటి రోజులు మళ్లీ విజయవాడకు రావాలి.

- సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

విజయవాడ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ‘బెజవాడను బ్లేజ్‌వాడ అంటారు. ఉష్ణోగ్రత వల్ల వచ్చిన పేరు కాదది. సైద్ధాంతిక విబేధాలతో పుట్టిన బ్లేజ్‌ (వేడి) ఇది..’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడ అతివాద, మితవాద అభిప్రాయాలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు సిద్ధార్థ అకాడమీకి చెందిన సిద్ధార్థ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష శిథిలమయ్యే పరిస్థితి ఏర్పడిందని భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు. మన భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర భాషలపై అవగాహన, పట్టు ఉన్నప్పటికీ మాతృభాషను నేర్చుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మాతృభాషలో పునాది లేకపోతే మనకు వచ్చే ఆలోచనల్లో పునాది లేనట్టేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలో సంభాషించుకోవడంతో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకోవాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలో పూర్వపు రోజుల మాదిరిగా సాహిత్య కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు విస్తృతంగా జరగాలని జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సతీశ్‌ చంద్రశర్మ, ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ప్రతినిధులు లీలా ప్రసాద్‌, కేఎన్‌ఎస్‌ఆర్‌ ప్రసాదరావు, పీవీపీ సిద్ధార్థ ప్రతినిధి మలినేని రాజయ్య, పీబీ సిద్ధార్థ విద్యాసంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-26T05:53:58+05:30 IST