తండ్రి తరపున తనయుడు

ABN , First Publish Date - 2021-01-20T05:36:52+05:30 IST

చాపాడులో ఎమ్మెల్యే తనయుడు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి తండ్రి స్థానంలో అధికారులతో స్పెషల్‌ ఆఫీసర్‌ కుర్చీలో కూర్చొని దాదాపు రెండు గంటలు పాటు సమీక్ష నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.

తండ్రి తరపున తనయుడు
చాపాడు ఎంపీడీవో కార్యాలయంలోని ప్రత్యేక అధికారి కుర్చీలో కూర్చొని మంగళవారం అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే తనయుడు నాగిరెడ్డి

అధికారులతో ఎమ్మెల్యే తనయుడి సమావేశాలు

14వ ఆర్థిక సంఘం నిధులపై సమీక్ష

ప్రత్యేక అధికారి ఛాంబరులో సమావేశం


కడప, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మైదుకూరు నియోజకవర్గానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. ఆ నిధులతో ఏయే పనులు చేయాలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మండల అధికారులతో సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మంగళవారం మైదుకూ రు, చాపాడు మండలాల్లో సమీక్ష సమావేశా లు ఏర్పాటు చేశారు. చాపాడులో ఉదయం 11గంటలకు సమావేశం ప్రారం భం కావాలి. తహసీల్దారు శ్రీహరి, ఎంపీడీవో శ్రీధర్‌నాయుడు, పంచాయతీరాజ్‌ డీఈఈ రామచంద్రారెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు. మండల పరిషత్‌ ప్రత్యేక అధికారి (స్పెషల్‌ ఆఫీసర్‌) ఛాంబర్‌లో సమా వేశం ఏర్పాటు చేశారు. అయితే.. మైదుకూరు సమీక్షలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొనడంతో చాపాడులో ఎమ్మెల్యే తనయుడు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి తండ్రి స్థానంలో అధికారులతో స్పెషల్‌ ఆఫీసర్‌ కుర్చీలో కూర్చొని దాదాపు రెండు గంటలు పాటు సమీక్ష నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.


మండలానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.95 కోట్లు వచ్చాయి. ఆ నిధులతో ఏయే పనులు చేయాలి..? ఏ గ్రామానికి ఎంత కేటాయించాలి..? అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆయా గ్రామాల వైసీపీ నాయకులతో సమావేశం అయ్యారు. ఇక్కడ ఒక్కటే కాదు.. సోమవారం దువ్వూరు మండలంలోనూ నాగిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దారు దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో జగదీశ్వరరెడ్డి, పీఆర్‌ ఏఈ ఈశ్వరయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మానస, ఆయా గ్రామాల కార్యదర్శులు హాజరయ్యారు. ఎమ్మెల్యే తనయుడు ప్రగతి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది తప్పని తెలిసినా అధికారులు కూడా మాకేందుకులే అని హాజరు కావడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు.. 14వ ఆర్థిక సంఘం నిధులు వైసీపీ నాయకులు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పంపకాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చాపాడు ఎంపీడీవో శ్రీధర్‌నాయుడుని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఎమ్మెల్యే తనయుడు నాగిరెడ్డి ఎంపీడీవో కార్యాలయంలోని స్పెషల్‌ ఆఫీసర్‌ ఛాంబరుకు వచ్చారు. అనధికారికంగా 14వ ఆర్థిక సంఘం నిధులు, పనుల వివరాలు అడిగితే వివరించామే తప్ప సమీక్ష సమావేశం నిర్వహించలేదని పేర్కొనడం కొసమెరుపు.



Updated Date - 2021-01-20T05:36:52+05:30 IST