కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-11-02T07:46:27+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కడప జిల్లాలో

కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు

కడపలో  పంట నష్టం రూ.139.28 కోట్లు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కడప జిల్లాలో ఎడతెరపి లేని వర్షానికి జనజీవనం స్తంభించింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోతకొచ్చిన వరి, కేపీ ఉల్లి, మొలక దశలో ఉన్న బుడ్డశనగ పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా మేరకు చెన్నూరు, ఖాజీపేట, కమలాపురం, వల్లూరు, పుల్లంపేట, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బీకోడూరు, సిద్ధవటం, నందలూరు మండలాల్లో 3212.5 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అరటి, పచ్చిమిర్చి, ఉల్లి, బొప్పాయి, టమాటా, పూలు, పసుపు పంటలు 896.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మొత్తం మీద వర్షంతో రూ.139.28 కోట్ల నష్టంవాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో జాలువారుతున్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది.


రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నా నదికి వరద పోటెత్తుతోంది. సోమశిల జలాశయానికి ఆదివారం సాయంత్రానికి 35 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. సోమశిల పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, 74 టీఎంసీలకు చేరుకోవడంతో సముద్రంలోకి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెట్ట ప్రాంతాల్లో సార్వా వరి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఈ వర్షాలకు పంట నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో సోమవారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత రాత్రి వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత పెరిగింది.

Updated Date - 2021-11-02T07:46:27+05:30 IST