ఉత్తరాంధ్రలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-05-05T09:00:10+05:30 IST

ఉత్తరాంధ్రలో వాన బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఈ మూడు జిల్లాల్లో ఐదుగురు మృతిచెందారు

ఉత్తరాంధ్రలో భారీ వర్షం

పిడుగుపాటుకు ఐదుగురు మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఉత్తరాంధ్రలో వాన బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఈ మూడు జిల్లాల్లో ఐదుగురు మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లాలో సాయంత్రానికి మేఘావృతమై ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతతో దద్దరిల్లింది. పలాసలో అత్యధికంగా 103.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్కలి మండలంలో లారీ డ్రైవర్‌ బొత్తాడ రాజే్‌షకుమార్‌ (30), మందస మండలంలో గొర్రెల కాపరి సాలిన గోపయ్య (62)లు పిడుగుపడి మృతిచెందారు. సంతబొమ్మాళి మండలంలో దుక్కిటెద్దు మృతి చెందింది. విజయనగరం జిల్లాలో విజయనగరం, గంట్యాడ, ఎల్‌.కోట, గజపతినగరం, మెంటాడ మండలాల్లో వర్షం కురిసింది. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో కొన్ని మండలాల్లో మామిడి తోటలకు పాక్షిక నష్టం వాటిల్లింది. గజపతినగరం రైల్వేస్టేషన్‌ సమీపంలో పిడుగుపడి రైతు ఎమ్‌.అప్పలస్వామి (52) మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం పీఈ చిన్నయ్యపాలెంలో పిడుగు పడి గ్రామానికి చెందిన తూము అర్జునరావు, తగరపు నాగబాబు మృతి చెందారు.


రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, తూర్పు, మధ్య భారతాల్లో మరో రెండు ఆవర్తనాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-05-05T09:00:10+05:30 IST