ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరు ఉధృతం

ABN , First Publish Date - 2021-12-31T07:13:13+05:30 IST

‘ఇక ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలపై పోరాటం ఉధృతం చేస్తాం. దీనికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందిస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజాహితం వైపు నడిపిస్తాం. రాజకీయాలకు దిశానిర్దేశం చేసేవి ఉభయగోదావరి జిల్లాలే.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరు ఉధృతం

  • ప్రతినెల రెండు మూడు సమస్యలపై ఆందోళనలు
  • 3న టీడీపీ జోన్‌-2 కమిటీ మీటింగ్‌
  • ఉభయగోదావరి జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల రాక
  • నియోజకవర్గాల వారీ సమస్యలపై  సమీక్ష
  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

రాజమహేంద్రవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘ఇక ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలపై పోరాటం ఉధృతం చేస్తాం. దీనికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందిస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజాహితం వైపు నడిపిస్తాం. రాజకీయాలకు దిశానిర్దేశం చేసేవి ఉభయగోదావరి జిల్లాలే. ఇక్కడ ఫోకస్‌ పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఇందుకోసం జనవరి 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ రాజమహేంద్రవరం రివర్‌బేలో ఉభయగోదావరి జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో (జోన్‌-2) సమావేశం నిర్వహించనున్నామని’ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు తదితరులతో కలసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం పార్టీపరంగా రాష్ర్టాన్ని ఐదు జోన్లుగా విభజించిందని, ఉత్తరాంధ్ర జిల్లాలు మొదటి జోన్‌లో ఉండగా, ఉభయగోదావరి జిల్లాలు రెండో జోన్‌లోనూ ఉన్నాయన్నారు. ఈ జోన్‌కు సంబంధించి ఇది మొదటి సమావేశమని, ఇందులో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జిలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలుసని, వాటిని చక్కదిద్దే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. 3న జరిగే సమావేశంలో ఉభయగోదావరి జిల్లాలోని సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలుచర్చిస్తామన్నారు. ఓ ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారన్నారు. ఇక ప్రతీ నెలా రెండుమూడు సమస్యలపై ప్రధాన కార్యక్రమాలు ఉంటాయని, ముం దు గుర్తించిన వాటితోపాటు అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలపై కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏకపక్షంగా కాకుండా భావ సారూప్యత గల పార్టీల భాగస్వామ్యంతో ఎన్నికలకు వెళుతోందని, ఈనేపఽథ్యంలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, లేకపోవచ్చు. కానీ ఇది ఇప్పుడే మాట్లాడుకోవలసిన అవసరం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. జనసేనతో పొత్తు ఉంటుందని ప్రచారం గురించి ఒకరు ప్రశ్నించడంతో ఆయన స్పందించారు. చంద్రబాబు, లోకేషన్‌ ఇద్దరూ నాయకులే. కానీ వచ్చేసారి రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అవుతారని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. తెలుగు మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతీ సుందరి, బీసీ నేత కుడుపూడి సత్తిబాబు, పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాదు, టీఎన్‌టీయుసీ నేత యాళ్ల శ్రీనివాసరావు, జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T07:13:13+05:30 IST