మిర్చికి ఎసరు

ABN , First Publish Date - 2021-11-26T07:17:21+05:30 IST

గత ఏడాది మిర్చి పంటకు సరైన ధర లభించకపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. ఈ ఏడాదైనా ధర బాగుంటుందనే ఆశతో రైతులు విలీన మండలాల్లో మిర్చి సాగుకు చేపట్టారు.

మిర్చికి ఎసరు
నెల్లిపాకలో పురుగు ఆశించిన పంటకు మందు పిచికారీ చేయిస్తున్న రైతు రమేష్‌.. ఈ పూతకే ఆశిస్తున్న పురుగు

  • మిర్చి రైతుల ఆశలను తోడేస్తున్న పురుగు 
  • విలీన మండలాల్లో పంటపై దాడి
  • పూత, పిందె ఎదుగుదలకు ఆటంకం  
  • పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం
  • గగ్గోలు పెడుతున్న రైతులు 
  • పట్టించుకోని హార్టికల్చర్‌ అధికారులు

ఎటపాక, నవంబరు 25: గత ఏడాది మిర్చి పంటకు సరైన ధర లభించకపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. ఈ ఏడాదైనా ధర బాగుంటుందనే ఆశతో రైతులు విలీన మండలాల్లో మిర్చి సాగుకు చేపట్టారు. మొన్నటివరకు ఎలాంటి చీడపీడలు, వైరస్‌ లేనప్పటికీ ప్రస్తుతం నలుపు రంగు పురుగు ఆశించి రైతులను కలవరపెడుతోంది. పూత దశలో పంటపై దాడి చేస్తోంది. దాంతో ఎదుగుదల కనిపించకపోవడంతోపాటు పూతకాయ దశకు చేరదని రైతులు వాపోతున్నారు. పూతలోని పుప్పొడి కూడా రాలిపోతోందంటున్నారు. ఇది పంట దిగుబడిపై తీవ్ర  ప్రభావం చూపుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఈ సీజన్‌లో ఎటపాకలో 3 వేల ఎకరాలు, కూనవరంలో 1,200 ఎకరాల్లో మిర్చి సాగు  చేశారు. నెల్లిపాక, నందిగామ, గన్నవరం తదితర గ్రామాల్లో రెండు రోజులుగా నలుపు పురుగు విజృంభిస్తోంది. ఈ పురుగు ఆశించిన పంటకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు వేప నూనెతో పిచికారీ చేయగా, మరికొందరు రైతులు ఇతర రైతుల సూచనలతో పలు రకాల రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. పురుగు ఉధృతి కొనసాగితే దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం విలీన మండలాల్లో మిర్చి పంట ఏపుగా పెరిగి పూత, పిందె దశలో ఉంది. ఒక్కో పూతపై చిన్నటి సైజులోని నల్లటి పురుగులు నాలుగైదు కనిపిస్తున్నాయి. పట్టుకునే ప్రయత్నం చేస్తే ఎగిరిపోతున్నాయి. పురుగు ఇప్పుడే పంటను ఆశించడంతో రైతులు అప్రమత్తమయ్యారు. నివారణకు అనేక రకాల రసాయన మందులను వినియో గిస్తున్నారు. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టామని, పురుగుల నివారణకు మందుల వాడకంతో మరింత భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. ఈ తరహా పురుగుని ఇటీవల గుంటూరు జిల్లా లో శాస్త్రవేత్తలు గుర్తించినట్టు కొందరు రైతులు చెబుతున్నారు. హార్టికల్చర్‌ అధికారులు వచ్చి పరిశీ లించి వెళ్తున్నారు తప్ప సరైన సూచనలు ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలపై తమకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. నెల్లిపాకకు చెందిన రైతు గుర్రం రమేష్‌ మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-11-26T07:17:21+05:30 IST