పోలవరం డిజైన్లపై రేపు డీడీఆర్‌పీ సమావేశం
ABN , First Publish Date - 2021-12-19T09:07:45+05:30 IST
పోలవరం డిజైన్లపై రేపు డీడీఆర్‌పీ సమావేశం
ఆమోదం లభిస్తేనే ఆగిన పనుల్లో కదలిక
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలక పనులకు సంబంధించిన డిజైన్లపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్యర్యంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్‌పీ) సోమవారం సమావేశం కానుంది. ప్రాజెక్టు పనులు ముందుకు సాగాలంటే డిజైన్లను ఆమోదించాల్సి ఉండటంతో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ప్రాజెక్టు విషయంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోన్న కేంద్ర జలశక్తి శాఖ, ఈ సమావేశంలో వాటికి ఆమోద ముద్ర వేస్తుందా, లేక ఇంకా మార్పులూ చేర్పులూ సూచిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆమోదం లభించాల్సిన కీలక పనుల్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులు, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ వద్ద ఏర్పడిన గుంత పూడ్చివేతకు ప్రత్యేక సాంకేతిక నైపుణ్యం, కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం మధ్యలో గ్యాప్ పూడ్చివేత తదితరాలు ఉన్నాయి. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక పరమైన ఇబ్బందులు, డిజైన్ల రూపకల్పనపై వర్చువల్ విధానంలో జరగనున్న డీడీఆర్‌పీ సమావేశం తన వైఖరిని స్పష్టం చేయనుంది.