రోడ్డునే తవ్వేశారు..!

ABN , First Publish Date - 2021-12-26T06:53:46+05:30 IST

ఇసుకాసురులు రోడ్డును సైతం వదలట్లేదు. ప్రస్తుతం ఇసుక తరలించాలంటే ఎన్ని నిబంధనలో. కొన్ని సందర్భాల్లో బిల్లు ఉన్నా.. పోలీసులు పట్టుకుని కేసు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు ఇవేవీ వర్తించట్లేదు. వారు యథేచ్ఛగా పగటిపూట ఎడ్లబండ్లలో, రాత్రిపూట ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు.

రోడ్డునే తవ్వేశారు..!

ఇసుకాసురుల దుశ్చర్య

అధికార పార్టీ నేతల దోపిడీ... 

బండ్లు, ట్రాక్టర్లలో తరలింపు

రోజూ కనీసం రూ.లక్ష సంపాదన

కన్నెత్తి చూడని అధికారులు

అవినీతి సొమ్ములో వాటాలే కారణమా?

బిల్లులున్నా.. సామాన్యులపై మాత్రం కేసులు

హిందూపురం టౌన, డిసెంబరు 25: ఇసుకాసురులు రోడ్డును సైతం వదలట్లేదు. ప్రస్తుతం ఇసుక తరలించాలంటే ఎన్ని నిబంధనలో. కొన్ని సందర్భాల్లో బిల్లు ఉన్నా.. పోలీసులు పట్టుకుని కేసు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు ఇవేవీ వర్తించట్లేదు. వారు యథేచ్ఛగా పగటిపూట ఎడ్లబండ్లలో, రాత్రిపూట ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. హిందూపురం ప్రాంతంలో అధికారికంగా ఇసుక రీచ లేకపోవడంతో అధికార పార్టీకి చెందిన కొందరికి ముద్దిరెడ్డిపల్లి నుంచి బాలరెడ్డిపల్లి వెళ్లే రహదారిలోని ఇసుక కల్పవృక్షంగా మారింది. నదిలో నీరుండటంతో రోడ్డును తవ్వేస్తున్నారు. ఈ రహదారి గుండా నిత్యం వందలాది మంది ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లలో హిందూపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి నుంచి బాలరెడ్డిపల్లి, శాసనకోట, నేతులపల్లి, సంగమేశ్వరం, ఊటకూరుకు వెళ్లి వస్తుంటారు. దీనికితోడు బాలరెడ్డిపల్లిలో నరసింహస్వామి ఆలయానికి భక్తులు వెళ్లి వస్తుంటారు. హిందూపురానికి వచ్చే విద్యార్థులు అధిక శాతం మంది పరిగి మండలం నుంచి ఈ దారి నుంచే వస్తారు. అలాంటి దారి తవ్వేయడంతో రెండు కి.మీ.., చుట్టేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా శ్మశానవాటికకు ఆనుకుని ఈ రోడ్డు ఉండటంతో ఎవరైనా మృతి చెందితే వారిని ఎలా తీసుకెళ్లాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

రోజూ వంద బండ్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. రాత్రిపూట 10 నుంచి 15 ట్రాక్టర్లు ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు కిందిస్థాయి సిబ్బంది సహకారాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. మేళాపురం, ముద్దిరెడ్డిపల్లికి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇసుక తరలించడానికే ఎడ్లబండ్లను కొనుగోలు చేశారు. బండి ఇసుక రూ.800 నుంచి రూ.1200 దాకా విక్రయిస్తున్నారు. రోజుకు వంద బండ్ల ఇసుక అక్కడి నుంచి తరలిస్తున్నట్లు ఎడ్ల బండ్ల కూలీలే చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.లక్ష వెనకేసుకొంటున్నట్లు తెలిసింది. ఇసుక రవాణాను స్థానిక అధికార పార్టీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నట్లు ఆ పార్టీలోనే పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పూలకుంటకు చెందిన ఓ వ్యక్తి అనుమతి తీసుకుని ఇసుకను తరలిస్తుండగా.. బిల్లులో ఉన్న సమయం కంటే ఏడు నిమిషాలు అధికం కావడంతో సెబ్‌ అధికారులు పట్టుకుని, స్టేషనకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న అధికార పార్టీకి చెందిన వారిని మాత్రం బిల్లులు లేకపోయినా వారివైపు సెబ్‌ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ అవినీతిలో వారికీ వాటాలున్నాయా.. అన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డును తవ్వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఎవరూ పట్టించుకోవడం లేదు: మహాలక్ష్మి, కౌన్సిలర్‌ 

పరిగి మండలంలోని పలు గ్రామాల నుంచి వందలాది మంది ద్విచక్రవాహనాల్లో హిందూపురానికి వచ్చిపోతుంటారు. రహదారిని తవ్వేయడంతో చుట్టు తిరిగి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు తవ్వేయడంతోపాటు శ్మశానవాటికలో సమాధులు కూల్చి మరీ ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.


కేసు వేయాలి: ఆదినారాయణ, శాసనకోట 

శాసనకోట నుంచి హిందూపురానికి ద్విచక్రవాహనాల్లో ఈ రహదారి ద్వారా వచ్చేవాళ్లం. ఆ రోడ్డును తవ్వేయడంతో  చుట్టుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక తరలించేవారు రోడ్డును కూడా వదలకపోతే ఎలా? వీరిపై కేసులు నమోదు చేయాలి.


అక్రమంగా తరలిస్తే ఉపేక్షించం: ఇస్మాయిల్‌, వనటౌన సీఐ 

ఇసుకను అనుమతి లేకుండా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. హిందూపురం ప్రాంతంలో ఇసుక రీచకు అనుమతి లేదు. అలాంటపుడు ఇసుకను ఎలా తరలిస్తారు? దీనిపై నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-12-26T06:53:46+05:30 IST