పీఎం జన్‌ధన్ ఖాతాదారులకు ప్రమాద బీమా రూ. 2లక్షలకు పెంపు
ABN, First Publish Date - 2020-08-26T22:00:41+05:30
సామాన్య ప్రజలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చి, గ్రామీణ ఆర్ధికవ్యవస్ధను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్‌ధన్‌యోజనను ప్రారంభించిందని కెనరా బ్యాంక్ ఏజీఎం వెంకటరామనర్సయ్య అన్నారు.
హైదరాబాద్: సామాన్య ప్రజలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చి, గ్రామీణ ఆర్ధికవ్యవస్ధను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్‌ధన్‌యోజనను ప్రారంభించిందని కెనరా బ్యాంక్ ఏజీఎం వెంకటరామనర్సయ్య అన్నారు. పీఎంజెడివై ప్రారంభించి ఈనెల 28వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తిఅవుతున్నసందర్భంగా పత్రికా సమాచార కార్యాలయం(పీఐబి), రీజినల్ అవుట్‌రీచ్‌బ్యూరో సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వెంకటరామనర్సయ్య ప్రసంగిస్తూ పధకం ప్రారంభంలో ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఈ పధకం అమలయ్యాక దేశంలో ఉన్న సుమారు ఆరు లక్షల గ్రామాల్లో అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం తాజాగా అర్హులైన వయోజనులందరికీ పీఎంజెడివై ఖాతాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఖాతా సౌకర్యంతో పాటు 2018 ఆగస్టు 28వ తేదీ తర్వాత ప్రారంభించిన ఖాతాలకు ప్రమాద బీమా సౌకర్యం గతంలో ఉన్న లక్షరూపాయల నుంచి రెండు లక్షలకు పెంచిందన్నారు. పీఎంజెడివై ఖాతాదారులకు రూ. 10వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కల్పించినట్టు తెలిపారు.
ఉచితంగా అందించే డెబిట్ కార్డును ఖాతాదారులు 45 రోజుల్లో యాక్టివేట్ చేసుకోవాలని, ప్రతి నెలా లావాదేవీలు జరుపుతూ ఉండాలని అప్పుడే ఖాతాదారుకి ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. కోవిడ్ సంక్షోభ సబయంలో 29 కోట్ల ప్రజలకు ప్రభుత్వం 30,705 కోట్ల సహాయాన్ని అందించడానికి పీఎంజెడివై ఖాతాలు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు.
వెబినార్ లో ప్రారంభోపన్యాసం చేసిన పీఐబి దక్షిణాది రాష్ర్టాల డైరెక్టర్ జనరల్ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ ఆరేళ్ల కాలంలో జన్‌ధన్‌ఖాతాల సంఖ్య దేశంలో 40.21కోట్లకు పెరిగాయని, 63శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చెందినవేనని అన్నారు. గత ఆరేళ్లలో ఈ ఖాతాలలో ప్రజలు 1,29,710 కోట్ల మొత్తాన్ని పొదుపు చేయగలిగారంటే గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధలో ఈ పథకం అనూహ్యమైన మార్పు తీసుకు వచ్చిందనడానికి ఉదాహరణగా చెప్పారు.
Updated Date - 2020-08-26T22:00:41+05:30 IST