మానసిక ఒత్తిడితో కరోనా రోగి బలవన్మరణం

ABN , First Publish Date - 2020-08-12T09:13:30+05:30 IST

మానసిక ఒత్తిడితో కరోనా రోగి బలవన్మరణం

మానసిక ఒత్తిడితో కరోనా రోగి బలవన్మరణం

ఆస్పత్రిలోనే పీపీఈ గౌన్‌తో ఉరేసుకున్న వృద్ధుడు


చాదర్‌ఘాట్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఓ వృద్ధుడు (60) టీవీల్లో వస్తున్న కొవిడ్‌ వార్తలతో పలు అనుమానాలు, మానసిక వత్తిడికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చాదర్‌ఘాట్‌ పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది చెప్పిన  ప్రకారం కరీంనగర్‌ జిల్లాకు చెందిన  ఈ వృద్ధుడు  సింగరేణి సంస్థలో కార్మికునిగా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ నెల 6న మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చేరాడు. కొంత కోలుకోవడంతో గత ఆదివారం ఐసీయూ నుంచి స్పెషల్‌ రూంకు మారాడు. అయితే కొవిడ్‌పై టీవీల్లో వస్తున్న వార్తలు చూసి  భయాందోళన చెందేవాడు.  తనను తిరిగి ఊరిలోకి రానిస్తారో లేదో, కుటుంబీకులు, బంధువులు పలకరిస్తారో లేదోననే అనుమానాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ రకమైన ఆలోచనలతో ఉన్న అతను సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో  బాత్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.  దుస్తులు వేసుకోడానికి వీలుగా ఏర్పాటు చేసిన రాడ్‌ (హ్యాంగర్‌)కు తాను ధరించిన పీపీఈ గౌన్‌తో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో చూసిన ఆస్పత్రి సిబ్బంది  వెంటనే చాదర్‌ఘాట్‌ పోలీసులకు తెలియజేశారు.  ఎస్‌ఐ సతీష్‌ వచ్చి వృద్ధుడి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-12T09:13:30+05:30 IST