15వ తేదీ తర్వాత ఎస్సారెస్పీ నీటి విడుదల

ABN , First Publish Date - 2020-07-10T09:05:32+05:30 IST

15వ తేదీ తర్వాత ఎస్సారెస్పీ నీటి విడుదల

15వ తేదీ తర్వాత ఎస్సారెస్పీ నీటి విడుదల

పూర్తి ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు


నిజామాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు ఈనెల 15 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన ఉత్తర తెలంగాణ జిల్లాల మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొదట నారుమళ్లకు.. ఆ తర్వాత పూర్తి ఆయకట్టుకు నీళ్లు అందించేలా ఇంజనీర్లు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎస్సారెస్పీతోపాటు కాళేశ్వరం ద్వారా మొత్తం ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. వర్షాకాలం సీజన్‌ మొదలైన తర్వాత ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బావులు, బోర్ల కింద వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1071.06 అడుగుల మేర 32 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాంలో 8 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిషన్‌ భగీరథకు రెండింటిలో కలిపి 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే మిగతా 30 టీఎంసీలను వానాకాలం పంటలకు వినియోగించనున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని కాలువలు, ఎత్తిపోతల పథకాలు కలిపి మొత్తం 15 లక్షల ఎకరాల వరకు సాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నారుమళ్ల కోసం కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేసి, ఆ తర్వాత క్రమేణా పెంచాలని నిర్ణయించినట్లు ఎస్సారెస్సీ సీఈ శంకర్‌ తెలిపారు.

Updated Date - 2020-07-10T09:05:32+05:30 IST