వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమించాలి

ABN , First Publish Date - 2020-12-07T08:35:37+05:30 IST

కేంద్రం తెచ్చిన రైతు, వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇలాంటి నల్ల చట్టాల రద్దు కోసం కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో, బయట కూడా ముందుండి పోరాడుతోందన్నారు. రాహుల్‌ గాంధీతో పాటు ఆయా రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో కిసాన్‌ సమ్మేళనాలు, రైతుల సంతకాల సేకరణ, ట్రాక్టర్‌ ర్యాలీలతో భారీ ఉద్యమం నిర్వహించారని చెప్పారు

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమించాలి

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి 


హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కేంద్రం తెచ్చిన రైతు, వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇలాంటి నల్ల చట్టాల రద్దు కోసం కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో, బయట కూడా ముందుండి పోరాడుతోందన్నారు. రాహుల్‌ గాంధీతో పాటు ఆయా రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో కిసాన్‌ సమ్మేళనాలు, రైతుల సంతకాల సేకరణ, ట్రాక్టర్‌ ర్యాలీలతో భారీ ఉద్యమం నిర్వహించారని చెప్పారు. ప్రతికూల వాతావరణం, పోలీసుల క్రూర నిర్భంధం, అణిచివేత ఉన్నప్పటికీ రైతులు వెనకడుగు వేయడం లేదన్నారు. 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తమ్‌ కోరారు. కాగా, అన్నదాతల ఉద్యమానికి మద్దతివ్వాలంటూ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ లేఖ రాశారు. 


రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ: భట్టి

రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 8న బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ చేతుల్లో పెడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిఽధర్‌రెడ్డి, ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ 1999లో ఒక ఓటు - రెండు రాష్ట్రాల పేరిట ప్రజలను మోసిందంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. 


అక్బర్‌ వ్యాఖ్యల వల్లే బీజేపీకి 48 సీట్లు: నిరంజన్‌

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే బీజేపీకి జీహెచ్‌ఎంసీలో 48 సీట్లు వచ్చాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ అన్నారు. పీవీ, ఎన్టీఆర్‌ల సమాధులు కూలుస్తామన్న ఆయన వ్యాఖ్యలు ప్రజల గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీ బీజేపీ నేత భాగ్యలక్ష్మి మందిరాన్ని దర్శించడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.


కేసీఆర్‌లో మార్పు రావాలి: వీహెచ్‌

సీఎం కేసీఆర్‌లో ఇకనైనా మార్పు రావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సూచించారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రె్‌సను శత్రువులా చూశావు. ఇప్పుడైమేంది?’’ అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. గ్రేటర్‌లో విచిత్ర ఎన్నికలు జరిగాయని, టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలను ప్రజలు నమ్మలేదన్నారు. సెక్యులర్‌ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని, లేదంటే దీక్ష చేస్తానని వీహెచ్‌ హెచ్చరించారు. 

Updated Date - 2020-12-07T08:35:37+05:30 IST