బీజేపీలోకి స్వామిగౌడ్!.. అగ్రనేతలు చర్చలు

ABN , First Publish Date - 2020-11-21T22:44:20+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరుణంలో బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. దుబ్బాకలో గెలిచిన ఊపుమీద ఉన్న కమలం నేతలు..

బీజేపీలోకి స్వామిగౌడ్!.. అగ్రనేతలు చర్చలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరుణంలో బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. దుబ్బాకలో గెలిచిన ఊపుమీద ఉన్న కమలం నేతలు.. గ్రేటర్‌లో కూడా జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అగ్ర నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర‌్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే వారు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.


ముకేష్ గౌడ్ కుమారుడు కూడా...?

దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్‌తో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలియవచ్చింది. గోషామహల్ డివిజన్ కాంగ్రెస్ టికెట్‌పై కాంగ్రెస్ నాయకత్వంతో విక్రమ్ గౌడ్‌కు విభేదాలు వచ్చాయి. దీంతో గోషామహల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గోషామహల్ డివిజన్ టిక్కెట్ తన వర్గీయులకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసే యోచనలో విక్రమ్ గౌడ్ ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో మిగిలిన 5 డివిజన్‌లో నామినేషన్ వేసిన అభ్యర్ధులు కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2020-11-21T22:44:20+05:30 IST