టీఆర్‌ఎ‌స్‌కు కార్యకర్తలే బలం

ABN , First Publish Date - 2020-05-13T09:58:26+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

టీఆర్‌ఎ‌స్‌కు కార్యకర్తలే బలం

  • ఎల్లవేళలా వారికి అండగా ఉంటాం
  • సన్న బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసిన గంగుల


కరీంనగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తన సొంత డబ్బులతో తెప్పించిన సన్న బియ్యం, నిత్యావసర సరుకులను కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యకర్తలకు మంగళవారం ఆయన పంపిణీ చేశారు. తన నియోజకవర్గంలోని సుమారు 3 వేల మంది కార్యకర్తలకు 15 రోజులకు సరిపడే సన్న బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కార్పొరేటర్లు, గ్రామాల్లో సర్పంచుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేస్తున్నామని, ఇంకా ఎవరైనా కార్యకర్తలు మిగిలి ఉంటే వారికీ సరుకులు అందిస్తామని తెలిపారు. ఓవైపు ప్రజలు, మరోవైపు పార్టీ కార్యకర్తలను కూడా ఆదుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని, వారికి అండగా ఉంటామన్నారు. ఇప్పటికే నాయీబ్రాహ్మణులు, రజకులు, పాన్‌షాపు యజమానులకు దాతల సహకారంతో నిత్యావసరాలను అందించామన్నారు. సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకూ సరుకులను అందజేయాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలను పాటిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కరోనా నుంచి కరీంనగర్‌ను కాపాడుకున్నామన్నారు. అనవసరంగా ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని, అత్యవసరమై వస్తే భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.


కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు బియ్యం, 

నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ 

Read more