రాష్ర్టానికి రూ.700 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-10-28T06:59:37+05:30 IST

తెలంగాణ రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఔషధ తయారీ (ఫార్మాస్యూటికల్‌) రంగంలో రూ. 700

రాష్ర్టానికి రూ.700 కోట్ల పెట్టుబడులు

గ్రాన్యుల్స్‌ ఇండియా రూ.400 కోట్లు

లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్లు

ఔషధ తయారీ రంగాల్లో ఉపాధి  

ఆ కంపెనీలకు మా సహకారం: కేటీఆర్‌

 

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఔషధ తయారీ (ఫార్మాస్యూటికల్‌) రంగంలో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇందులో గ్రాన్యుల్స్‌ ఇండియా రూ.400 కోట్లు, లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు కూడా హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో తమ తమ తయారీ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ఈ మేరకు మంగళవారం గ్రాన్యుల్స్‌ కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌ , లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో సత్యనారాయణ వేర్వేరుగా ప్రగతి భవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. 


తమ కంపెనీల పెట్టుబడుల గురించి చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన గ్రాన్యుల్స్‌ ఇండియా, లారస్‌ ల్యాబ్స్‌ కంపెనీలను మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా ఔషధ తయారీ రంగంలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతమైన పారిశ్రామిక విధానాలు ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ తదితర రంగాల్లోనూ పెట్టుబడులు వ స్తున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన గ్రాన్యుల్స్‌ కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే తయారీ యూనిట్‌ నుంచి 10 బిలియన్‌ ఫినిష్డ్‌ డోసులను తయారు చేయనుంది. ఈ కంపెనీ ఏర్పాటయితే సుమారు 16 వందల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. గ్రాన్యుల్స్‌ ఇండియా ప్రపంచవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో తయారీ యూనిట్లను నెలకొల్పింది. 75 దేశాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్‌ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ ఇంటర్మీడియట్‌ యూనిట్‌ను హైదరాబాద్‌కు సమీపంలోని గాగిల్లాపూర్‌లో నెలకొల్పింది. లారస్‌ ల్యాబ్స్‌ పెట్టుబడిని రెండు దఫాలుగా పెట్టనున్నట్లు సంస్థ సీఈవో తెలిపారు. 5 బిలియన్‌ డోసుల సామర్థ్యం కలిగిన ఫార్ములేషన్‌ ఫెసిలిటీ యూనిట్‌ కోసం పెట్టుబడులు పెడుతున్నామని ఆయన చెప్పారు.


Updated Date - 2020-10-28T06:59:37+05:30 IST