రూ.30 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి

ABN , First Publish Date - 2020-09-12T09:17:38+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ట్రాఫిక్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం రూ.30 వేల

రూ.30 వేల కోట్లతో  రోడ్ల అభివృద్ధి

జీహెచ్‌ఎంసీలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

వ్యూహాత్మకంగా రహదారులు: కేటీఆర్‌


హైదరాబాద్‌/సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ట్రాఫిక్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం రూ.30 వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ) చేపట్టామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల పనుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశాల్లో ఉన్నాయని చెప్పారు. 18 ప్రాంతాల్లో పనులు పూర్తయి ఉపయోగంలోకి వచ్చాయని వెల్లడించారు.


శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్‌ మాట్లాడారు. నగరంలో గ్రిడ్‌లాక్‌ సమస్య పరిష్కారానికి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ, లింక్‌ రోడ్ల వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో భూ సేకరణ కోసం జీహెచ్‌ఎంసీ కమిషర్‌ను ప్రత్యేక కలెక్టర్‌గా గుర్తిస్తూ అధికారాలను అప్పగించినట్టు పేర్కొన్నారు. పాతబస్తీలో రహదారుల విస్తరణ కోసం గడిచిన ఐదేళ్లలో రూ.713 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.


నగరంలో రోడ్ల విస్తరణకు కేటాయించిన మొత్తంలో 25 శాతం పాతబస్తీకి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇది కాకుండా రహదారులకు రూ.477 కోట్లు, ఎస్‌ఆర్‌డీపీకి రూ.228 కోట్లు, లింక్‌ రోడ్ల కోసం రూ.8 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఆస్తులు కోల్పోయిన వారికి అభివృద్ధి బదలాయింపు హక్కు కల్పించడం ద్వారా రూ.568 కోట్లు ఆదా చేశామని చెప్పారు.

టీడీఆర్‌ బ్యాంకు ఏర్పాటు చేశామని, దేశంలోనే ఈ తరహా బ్యాంకు ఏర్పాటు చేయడం తెలంగాణలోనే మొదటిసారి అని చెప్పారు. టీడీఆర్‌ బ్యాంకు ఏర్పాటుతో రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతోందని వివరించారు. 


Updated Date - 2020-09-12T09:17:38+05:30 IST