జిల్లాకు మరో మణిహారం

ABN , First Publish Date - 2020-04-21T09:00:38+05:30 IST

జిల్లా సిగలో మరో మణిహారం చేరింది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు నెలవుగా ఉన్న

జిల్లాకు మరో మణిహారం

గచ్చిబౌలిలో టిమ్స్‌ ఏర్పాటు 

ఉమ్మడి జిల్లా వాసులకు దక్కనున్న వైద్యసేవలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : జిల్లా సిగలో మరో మణిహారం చేరింది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు నెలవుగా ఉన్న జిల్లాలో కొత్తగా వైద్య సేవలకు కీలక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల  ఉమ్మడి జిల్లావాసులు సంతోషపడుతున్నారు. గచ్చిబౌలి క్రీడా గ్రామంలోని స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ను టిమ్స్‌ (తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌) ఆసుపత్రిగా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కరోనా రోగుల కోసం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను 1500 పడకల ఆసుపత్రిగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి.


14 అంతస్తుల్లో ఉన్న ఈ భవనంలో 540 రూములు ఉన్నాయి. గతంలో జాతీయ క్రీడలు, అఫ్రో ఏషియన్‌ గేమ్స్‌ సమయంలో క్రీడాకారుల కోసం అత్యాధునిక రీతిలో నిర్మించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం అదనపు పడకల ఆసుపత్రుల నిర్మాణంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా ఈ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను  ఆగ మేఘాలపై 1500 పడకల ఆసుపత్రిగా మార్చారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌, గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రఘనందన్‌రావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కలిసి రికార్డుస్థాయిలో ఈ పనులు పూర్తి చేశారు. అయితే దీన్ని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని టిమ్స్‌గా మారుస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని, ఇకనుంచి ఈ భవనం వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. అంతేకాక టిమ్స్‌ అభివృద్ధి కోసం పక్కనేఉన్న మరో 15ఎకరాల భూమి కూడా ఇస్తామన్నారు.


నగరం నలుమూలల వైద్యసేవలు విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా చికిత్సలు పూర్తయిన తరువాత దీన్ని పూర్తిస్థాయిలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధిచేస్తా మని చెప్పారు. నిమ్స్‌కు కంటే ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందులో 750 పడకలు సాధారణ సేవలకు అందుబాటులో ఉంచుతామని మిగిలిన 750 మల్టీ స్పెషాల్టీ బెడ్‌లుగా అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని  తెలిపారు. ఈ ఆసుపత్రిలో పీజీ వైద్య, విద్య సైతం ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే టిమ్స్‌ ఏర్పాటు వల్ల నగరవాసులతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా వైద్య సేవలు దక్కనున్నాయి.

Updated Date - 2020-04-21T09:00:38+05:30 IST