రెవెన్యూ అధికారుల పనితీరుపై కలెక్టర్‌ హనుమంతరావు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-08T07:16:03+05:30 IST

రెవిన్యూ అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై వేటేశారు. అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో..

రెవెన్యూ అధికారుల పనితీరుపై కలెక్టర్‌ హనుమంతరావు ఆగ్రహం

  •  ముగ్గురు రెవెన్యూఅధికారులు, ఇరిగేషన్‌ ఏఈ సస్పెన్షన్‌
  •  తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలని హెచ్చరిక


సంగారెడ్డి టౌన్‌, మార్చి 7: రెవిన్యూ అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై వేటేశారు. అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో ముగ్గురు రెవిన్యూ సిబ్బంది, ఇరిగేషన్‌ అధికారిని శనివారం సస్పెండ్‌ చేశారు. గుమ్మడిదల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆరీఫ్‌ మోయీనుద్దీన్‌, అన్నారం వీఆర్వో కె.నారాయణరావు, కంది వీఆర్వో సత్యనారాయణ, గుమ్మడిదల ఇరిగేషన్‌ ఏఈ గులాం మొయీనుద్దీన్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 అధికారుల పనితీరుపై నివేదికలున్నాయి

రెవిన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది పనితీరులో మార్పు రాకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు తహసీల్దార్లు, వీఆర్వోల పనితీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పటికి పట్టించుకోవడంపై ఆగ్రహం చెందారు. తన వద్ద రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై ఇంటలిజెన్స్‌ రిపోర్టు ఉందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు. తెల్లాపూర్‌లో రెవిన్యూ శాఖకు తెలియకుండా అనుమతులు లేని కట్టడాలు ఎలా వచ్చాయని కలెక్టర్‌ అధికారులను ప్రశ్నించారు. అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో అంబదాస్‌, డీఎస్వీ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.


మహిళలు ఆర్థికంగా ఎదగాలి

సంగారెడ్డి అర్బన్‌: మహిళలు ఉన్నతంగా జీవిస్తూ అన్నిరంగాల్లో సాధికారత దిశగా అడుగలేయాలని కలెక్టర్‌ హనుమంతరావు కోరారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఉద్యోగపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. మహిళల కోసం ప్రత్యేకంగా 27వ వార్డులో పార్కును ప్రారంభిస్తున్నామని తెలిపారు. పగలంతా విధులు నిర్వర్తించి సాయంకాలం పార్కులో సేద తీరేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆటపోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు.

Updated Date - 2020-03-08T07:16:03+05:30 IST