ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-02-08T11:37:29+05:30 IST

ఇంటర్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

  • పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూడాలి
  • వీడియోకాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

సంగారెడ్డి టౌన్‌: ఇంటర్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి శుక్రవారం వీడియో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావద్దని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌ మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షలు ప్రతి విద్యార్థికీ టర్నింగ్‌ పాయింట్‌ అయినందున విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హన్మంతరావు మాట్లాడుతూ మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగనున్నాయని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ఇంటర్‌ పరీక్షల కోసం 49 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 32,138 మంది విద్యార్థులు హాజరువుతున్నారని, ఇందుకోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 17 స్టోరేజీ పాయింట్లు, 12 రూట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్‌ శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, పోలీసు శాఖ ద్వారా అదనపు బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో డీఈఈవో కిషన్‌, అదనపు ఎస్పీ సృజన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T11:37:29+05:30 IST