‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2020-12-13T05:57:54+05:30 IST

మండలంలోని పాలమాకుల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల ఎంపిక జాబితాలో అర్హులకు అన్యాయం జరుగుతున్నదని గ్రామస్థులు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం
ఫిర్యాదు బాక్స్‌లో వినతిపత్రం వేస్తున్న పాలమాకుల గ్రామస్థులు

నంగునూరు, డిసెంబరు 12 : మండలంలోని పాలమాకుల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల ఎంపిక జాబితాలో అర్హులకు అన్యాయం జరుగుతున్నదని గ్రామస్థులు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని డబుల్‌ బెడ్రూం పంపిణీ విషయంలో గతంలో తహసీల్దార్‌ తాత్కాలికమైన అర్హుల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలో వేశారని తెలిపారు. ఈ విషయమై ప్రజల అభ్యంతరాల మేరకు గ్రామసభ నిర్వహించారని, తహసీల్దార్‌ లోతుగా పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే గతంలో ఇచ్చిన జాబితాలో ఎలాంటి మార్పులు లేకుండా గ్రామపంచాయతీ కార్యాలయంలో వేశారని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించి అర్హులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌తో పాటు పలువురు వార్డుసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:57:54+05:30 IST