ఓ హైదరాబాదీ..ఓటుకు జైకొట్టు

ABN , First Publish Date - 2020-12-01T07:53:42+05:30 IST

రాష్ట్రం మొత్తం ఓటర్లలో నాలుగో వంతు ఇక్కడే.. మూడు వంతుల జనాభాలో ఒక వంతు ఇక్కడే.. అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యావంతులున్నది ఇక్కడే.. అనేక రంగాల ప్రముఖులు నివసించేది ఇక్కడే..! కానీ, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి వచ్చేసరికి అంతా వెనుకడుగే

ఓ హైదరాబాదీ..ఓటుకు జైకొట్టు

నిర్లిప్తత వీడి చలో పోలింగ్‌ స్టేషన్‌

మూడు ఎన్నికల్లో 50 శాతంలోపే పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ గత ఎన్నికల్లో 45 శాతమే

బస్తీల్లో చైతన్యం.. కాలనీల్లో నైరాశ్యం

పోలింగ్‌ కేంద్రాలకు రాని ఉన్నత వర్గాలు

విద్యావంతులున్న చోట ఇది అత్యల్పం

వజ్రాయుధాన్ని వృథా చేస్తోన్న వైనం


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మొత్తం ఓటర్లలో నాలుగో వంతు ఇక్కడే.. మూడు వంతుల జనాభాలో ఒక వంతు ఇక్కడే.. అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యావంతులున్నది ఇక్కడే.. అనేక రంగాల ప్రముఖులు నివసించేది ఇక్కడే..! కానీ, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి వచ్చేసరికి అంతా వెనుకడుగే. ఇదీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని పరిస్థితి. 2016 జీహెచ్‌ఎంసీ, 2018 అసెంబ్లీ ముందస్తు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వేటిలోనూ పోలింగ్‌ శాతం 51 దాటలేదు. వీటిలో అసెంబ్లీ ఎన్నికలు (50.86 శాతం) నయమనిపించినా, గత జీహెచ్‌ఎంసీ (45.29 శాతం), లోక్‌సభ (39.46) ఎన్నికల్లో సగంమంది కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. 


ఓటు పండుగండి.. గడప దాటండి

పోలింగ్‌ రోజు ఓటరు బయటకు రాకపోవడమే హైదరాబాద్‌లో తక్కువ ఓటింగ్‌ శాతానికి కారణం. ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల్లో  ఎక్కువమంది ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. సెలవుదినంగా భావిస్తున్న చాలామంది విశ్రాంతి తీసుకోవడమో, విహారయాత్రలకు వెళ్లడమో చేస్తున్నారు. ఫలితంగా అభ్యర్థుల్లో అధికులు తక్కువ శాతం మంది ప్రజల ఆమోదంతోనే ఎన్నికవుతున్నారు. అయితే, పోలింగ్‌ శాతం తగ్గడానికి  డూప్లికేట్‌, మృతుల పేర్లను తొలగించకపోవడమూ కారణమంటున్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఉండే ఓటర్‌.. మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పాత చిరునామాలోని ఓటు యథాతథంగా కొనసాగుతోంది. ఇలా వేలాది మంది ఓట్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. అసి్‌ఫనగర్‌లో ఓ అభ్యర్థి తన డివిజన్‌ పరిధిలోని ఓటరు జాబితాను పరిశీలించగా.. ఒక పోలింగ్‌ కేంద్రంలో 23, మరోచోట 51 డూప్లికేట్‌ ఓట్లు గుర్తించారు.


అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

ఎన్నికలు జరిగే ప్రతిసారి బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది. అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, భన్సీలాల్‌పేట, అంబర్‌పేట నియోజకవర్గంలోని రెడ్‌బిల్లింగ్‌ ఏరియా, గోల్నాక, పటేల్‌నగర్‌, ముషీరాబాద్‌లోని పాలమూరు బస్తీ, రాంనగర్‌, కవాడిగూడ, గాంధీనగర్‌, మాదాపూర్‌లోని వడ్డెరబస్తీ, గుట్టల బేగంపేట్‌, ఇజ్జత్‌నగర్‌, మస్తాన్‌బస్తీ, గోపన్‌పల్లి, ఖాజాగూడతో పాటు మరో 1,400 బస్తీల్లో 63 నుంచి 65 శాతం ఓటింగ్‌ నమోదవుతోంది. ఇక్కడివారు తప్పకుండా ఓట్లు వేస్తారని అభ్యర్థులు సైతం ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. 


మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్‌, అయ్యప్ప సొసైటీ, గోకుల్‌ ప్లాట్స్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, చందానగర్‌, మియాపూర్‌, టోలీచౌకీ, మెహిదీ పట్నం, మణికొండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, వెంగళరావునగర్‌, కూకట్‌పల్లిలోని పలు కాలనీలు, అపార్ట్‌మెంట్ల్లలోని ప్రజలు ఓటింగ్‌ను పట్టించుకోవడంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిలో 2002 నుంచి 2019 వరకు బల్దియా, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ శాతం చూస్తే 35 నుంచి 40 శాతం పోలింగ్‌కు నమోదవకపోవడం గమనార్హం. ఎవరొచ్చినా చేసేదేముంది? అన్న ధోరణి వీడి.. ‘పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మెరుగైనవారిని ఎన్నుకుందాం’ అని భావిస్తే ఓటింగ్‌ శాతం మెరుగుపడే వీలుంది. 


74 లక్షల మంది ఓటర్లు

తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. పలు డివిజన్లలోని అభ్యర్థులు అత్యధిక పోలింగ్‌పై ఆశలు పెంచుకున్నారు.  65 నుంచి 75 శాతం వరకు ఓటింగ్‌ జరిగితే తమకు గెలుపు అవకాశాలుంటాయని ప్రతిపక్ష పార్టీలు భావిస్తుండగా, 50 శాతం పోలింగ్‌ దాటకూడదని సిట్టింగ్‌ అభ్యర్థులు అనుకుంటున్నట్లు సమాచారం. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 74.23 లక్షల మంది ఓటర్లకు 33.60 లక్షల మంది (45.29 శాతం) హక్కును వినియోగించుకున్నారు. 2009తో పోలిస్తే 3 శాతంపైనే ఉన్నా.. మొత్తమ్మీద చూస్తే తక్కువే. ఇప్పుడు 74.67 లక్షల ఓటర్లుండగా.. ఎంతమంది హక్కును వినియోగించుకుంటారో చూడాలి. 


హైదరాబాద్‌వాసులూ ఓటు వేయండి: బండి సంజయ్‌ 

హైదరాబాద్‌ వాసులు ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఉన్నా నగరానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధం ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తుందన్నారు. ఇష్టమైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఇస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించనుందని పేర్కొన్నారు. 


సంవత్సరం పోలింగ్‌ శాతం

2009 42.04 (జీహెచ్‌ఎంసీ ఎన్నికలు)

2009 58.00 (అసెంబ్లీ సాధారణ)

2014 53.00 (అసెంబ్లీ సాధారణ)

2016 45.29 (జీహెచ్‌ఎంసీ ఎన్నికలు)

2018 50.86 (అసెంబ్లీ ముందస్తు)

2019 39.46 (లోక్‌సభ సాధారణ)

Updated Date - 2020-12-01T07:53:42+05:30 IST