కిషన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-11-27T07:44:00+05:30 IST

హైదరాబాద్‌ పాతబస్తీలో పాకిస్థానీలు, రోహింగ్యాలుంటే గుర్తించి, చర్యలు తీసుకోవడంలో విఫలమైన కేంద్ర హోం శాఖ

కిషన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

 పాత బస్తీలో రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తోంది..?

 రెచ్చగొట్టే వ్యాఖ్యలు బీజేపీ చేతకానితనం: అసదుద్దీన్‌

హైదరాబాద్‌/ఎర్రగడ్డ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పాతబస్తీలో పాకిస్థానీలు, రోహింగ్యాలుంటే గుర్తించి, చర్యలు తీసుకోవడంలో విఫలమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశా రు. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్‌షాకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో విదేశీయులున్నారని వారిపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామనే బీజేపీ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనలు వారి చేతకానితనాన్ని తెలుపుతున్నాయని విమర్శించారు.


జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భోలక్‌పూర్‌, షేక్‌పేట, ఎర్రగడ్డలో జరిగిన బహిరంగ సభల్లో అసద్‌ ప్రసంగించారు. గాడ్సేను దేశభక్తుడు అనే సంప్రదాయం బీజేపీది అని విమర్శించారు. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులంతా వరుస కట్టారని, ప్రధాని మోదీ సైతం వచ్చి ప్రచారంలో పాల్గొంటారమోనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, మంచినీటి సౌకర్యాల గురించి మాట్లాడాలి తప్ప మజ్లిస్‌, అసద్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు.

‘వరదలకు ఇళ్లన్నీ మునిగిపోతే ఒక్క బీజేపీ నాయకుడైనా వచ్చి పరామర్శించి, నష్ట పరిహారం అందించారా?. అలాంటివారు ప్రచారానికి వస్తున్నారు’ అని విమర్శించారు.


Updated Date - 2020-11-27T07:44:00+05:30 IST