విహారంలో విషాదం

ABN , First Publish Date - 2020-12-21T05:22:31+05:30 IST

విహారంలో విషాదం

విహారంలో విషాదం
శీలం చలపతిరెడ్డి, జంగా రామనర్సింహారెడ్డి, వేమిరెడ్డి సాయిరెడ్డి(ఫైల్‌), గాలింపు చర్యలు

ఈతకోసం నీటిలోకి దిగి ముగ్గురు యువకులు మృతి

పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఘటన

కల్లూరు మండలం బత్తులపల్లిలో తీవ్ర విషాదం

పెనుబల్లిరూరల్‌/కల్లూరు, డిసెంబరు 20: ఖమ్మం జిల్లా పెనుపల్లిమండలంలో విహారయాత్ర మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవుదినం కావడంతో కాలక్షేపంకోసం మండలంలోని పులిగుండాల ప్రాజెక్టువద్ద వెళ్లి సరదాగా సరదగా ఈతకొట్టేందుకు నీటిలోకి దిగి నీట మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు విహార కేంద్రం కావడంతో కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది యువకులు ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం అందరూ భోజనం చేసిన తర్వాత జంగ రామనరసింహారెడ్డి(24), వేమిరెడ్డి సాయిరెడ్డి(18), శీలం చలపతిరెడ్డి(25)తో పాటు వేల్పుల మురళి, వేల్పుల నరసింహారావులు సరదాగా ఈతకొట్టేందుకు ప్రాజెక్టులోకి దిగారు. ఈ క్రమంలో వారు లోతు ప్రాంతంలోకి వెళ్లగా ఈత రాకపోవడంతో వారిలో నలుగురు నీటిలో మునిగారు. దాంతో వారితో పాటే ఉన్న వేల్పుల నరసింహారావు నీళ్లలోకి మునుగుతున్న వేల్పుల మురళీని బయటకు లాగాడు. కానీ మిగతా ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కల్లూరు ఏసీపీ వెంకటేష్‌, సత్తుపల్లి రూరల్‌ సీఐ తాటిపాముల కరుణాకర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గాలింపు చర్యలను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సింగరేణి అధికారులు పర్యవేక్షించారు. సాయంత్రం 7గంటల సమయంలో వారి మృతదేహాలు లభించాయి. సరదాగా స్నేహితులతో కలసి విహారానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి స్వగ్రామం బత్తులపల్లి శోకసంద్రంలో మునిగింది. 

 వ్యవసాయ పనులు ముగించుకొని.. 

మృతుల్లో రామనరసింహారెడ్డి ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా సాయిరెడ్డి డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటుండగా చలిపతిరెడ్డి వెల్డింగ్‌ షాపులో పనిచేస్తున్నారు. దీంతో పాటు ఈ ముగ్గురు పలువురితో కలిసి సాయంత్రం తర్వాత వరిగడ్డి పనికి వెళుతుంటారు. శనివారం సాయంత్ర గడ్డితోలే పనులు ముగియడంతో మిత్రులతో కలిగి విందు చేసుకునేందుకు  ఆదివారం ఉదయం పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వచ్చి మృత్యు ఒడికి చేరారు. మృతిచెందిన ముగ్గురు యువకులూ వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో వారి తల్లిదండ్రులు రోదనలు పలువురి హృదయాలను కలిచివేశాయి. ఏకైక కుమారులు మృతిచెందడంతో తల్లిదండ్రులు ఆవిషాద వార్తను తెలుసుకుని ఇళ్లలోనే స్పృహతప్పి పడిపోయారు. 

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

పులిగుండాల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఘటనా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని, ప్రాజెక్టు వద్ద ప్రమాదాల బారినపడకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి  తెలిపారు.   


Updated Date - 2020-12-21T05:22:31+05:30 IST