దక్షిణ అయోధ్యకు అధ్యయనోత్సవ శోభ

ABN , First Publish Date - 2020-12-14T04:59:40+05:30 IST

దక్షిణ అయోధ్యకు అధ్యయనోత్సవ శోభ

దక్షిణ అయోధ్యకు అధ్యయనోత్సవ శోభ
విద్యుద్దీపాల వెలుగులో భద్రాద్రి రామాలయం

రేపటినుంచి దశావతారాల్లో భద్రాద్రి రామయ్య

24న తెప్పోత్సవం, 25న ఉత్తరద్వార దర్శనం

రేపటినుంచి నిత్యకల్యాణాల నిలిపివేత

ఈసారి కొవిడ్‌ నిబంధనలతో నిర్వహణ

భద్రాచలం, డిసెంబరు 13: దక్షిణ అయోఽధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రానికి అధ్యయనోత్సవ శోభ సంతరించుకుంది. మంగళవారం నుంచి దశావతార అలంకరణలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం నుంచి జనవరి 4వరకు దేవస్థానం ఆధ్వ ర్యంలో 20రోజులపాటు అధ్యయనోత్సవాలను నిర్వహించను న్నారు. అనంతరం జనవరి 5 నుంచి 7 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా మంగళవారం నుంచి 25 వరకు నిత్యకల్యాణాలను నిలిపివేయనున్నారు. 

రేపటినుంచి దశావతార అలంకారాలు

భద్రాద్రి రామాలయంలో మంగళవారం శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి పదిరోజులు దశావతార అలంకారాలు (పగల్‌పత్తు ఉత్సవాలను) నిర్వహించను న్నారు. 15న మత్స్యావతారం, 16న కూర్మావతారం, 17న వరాహావతారం, 18న నృసింహావతారం, 19న వామనా వతారం, 20న పరశురామావతారం, 21న శ్రీరామా వతారం, 22న బలరామావతారం, 23న శ్రీకృష్ణ అవతారం నిర్వహించనున్నారు. కాగా 24న తిరుమంగై ఆళ్వారు పరమ పదోత్సవంతో పగల్‌పత్తు ఉత్సవాలు పరిసమాప్త మవుతాయి. 25న శ్రీవైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తరద్వారంలో స్వామివారు తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు దర్శనభాగ్యం ఉండనుండగా కేవలం నిర్దేశించిన 200 మంది వీవీఐపీ భక్తులకే అనుమతి ఉంటుందని దేవస్థానం అధికారులు వెల్లడించారు. డిసెంబరు 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు సేవలు పది రోజులపాటు నిర్వహించనున్నారు. 

కరోనా మార్గదర్శకాల ప్రకారం..

ఈసారి కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యయనోత్స వాలను దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్నారు. ఈసారి దశావతార అలంకారాల్లో స్వామివారిని రామాలయ ప్రాంగణం లోని చిత్రకూట మండపానికి తీసుకువచ్చి ప్రత్యేకపూజలు చేయనున్నారు. అదేవిఽధంగా 24న తెప్పోత్సవాన్ని సైతం చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న యాగశాలలో తాత్కాలికంగా నిర్మించిన నీటిదోనెలో నిర్వహించనున్నారు. రాపత్తు సేవలను సైతం చిత్రకూట మండపంలోనే నిర్వహిం చనున్నట్టు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-12-14T04:59:40+05:30 IST