రోడ్ల నిర్వహణలో ప్రైవేట్‌ సంస్థలు విఫలం

ABN , First Publish Date - 2020-03-02T09:16:44+05:30 IST

హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితి వల్లే చెడ్డ పేరు వస్తోందని భావించిన ప్రభుత్వం కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎంపీ)లో భాగంగా నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌కు అప్పగించింది.

రోడ్ల నిర్వహణలో ప్రైవేట్‌ సంస్థలు విఫలం

నిర్మించాల్సింది 350 కి.మీలు

నిర్మించింది 10 కి.మీలే.. 

రంగులు వేసి.. గీతలు గీసి మాయ

పలుమార్లు కేటీఆర్‌ ఆగ్రహం

అయినా పూర్తిస్థాయిలో ప్రారంభం కాని పనులు

జూన్‌ నాటికి నిర్ణీత పనులు జరగడం కష్టమే

ఈ యేడాదీ నగరవాసులకు ఇబ్బందులు తప్పవా..?

అగ్రిమెంట్‌ జరిగిన యేడాదికి 50 శాతం నిర్మిస్తామంటోన్న ఏజెన్సీలు 


709 కి.మీలు - నిర్మాణం, నిర్వహణ కోసం  మూడు నెలల క్రితం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించిన రహదారులు. 

10.09 కి.మీలు - ఈ నెల 24వ తేదీ వరకు కార్పెటింగ్‌ చేసిన, నిర్మించిన బీటీ/వీడీసీసీ రోడ్లు. 

ఒప్పందం ప్రకారం జూన్‌ వరకు 50 శాతం అంటే దాదాపు 350 కి.మీల రహదారుల నిర్మాణం జరగాల్సి ఉండగా, మూడు శాతంలోపే పనులు పూర్తయ్యాయి. 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 1, (ఆంధ్రజ్యోతి):  హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితి వల్లే చెడ్డ పేరు వస్తోందని భావించిన ప్రభుత్వం కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎంపీ)లో భాగంగా నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌కు అప్పగించింది. మెరుగైన రహదారుల విషయాన్ని పక్కన పెడితే, ఒప్పందం జరిగి మూడు నెలలైనా ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించ లేదు. డివైడర్లకు రంగులు వేసి, రోడ్లపై గీతలు గీసి మమ అనిపిస్తున్నాయి కొన్ని సంస్థలు. దీంతో అధ్వాన రోడ్లకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రయోగం ఇప్పటికైతే విఫలమైనట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు సమావేశాల్లో పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు రహదారుల నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంస్థలని మీకు అప్పగిస్తే పరిస్థితి మారుతుందనుకున్నాం.. మరీ ఇంత అధ్వానమా..? అని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.


అయినా, పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇప్పటికీ ఒకటీ, రెండు సంస్థలకు సంబంధించి బీటీ మిక్సింగ్‌ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందం ప్రకారం జూన్‌ వరకు అప్పగించిన దాంట్లో 50 శాతం రోడ్లు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కనీసం మూడు శాతం కూడా పూర్తవలేదు. యేడాదిలో గ్రేటర్‌ ఎన్నికలున్న నేపథ్యంలో రోడ్లను మెరుగపర్చడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్న నిర్ణయం విఫల ప్రయోగంగా మారే ప్రమాదం నెలకొంది. నవంబర్‌లో అగ్రిమెంట్‌ జరిగింది. ఒప్పందం ప్రకారం యేడాదిలో 50 శాతం రోడ్లు నిర్మించాలి. వచ్చే అక్టోబర్‌, నవంబర్‌ వరకు పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయని ఓ అధికారి చెప్పారు. 


గీతలు.. రంగులపైనే...

గ్రేటర్‌లో 9,103 కి.మీలు ఉండగా.. 709 కి.మీల ప్రధాన రహదారులను ఆరు ప్యాకేజీలుగా విభజిస్తు నిర్మాణం, నిర్వహణ, ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ, పారిశుధ్య బాధ్యతలు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. అగ్రిమెంట్‌ ప్రకారం జూన్‌ వరకు 350 కి.మీల మేర రోడ్ల నిర్మాణం పూర్తవ్వాలి. ఇప్పటి వరకు 10.09 కి.మీల పనులు పూర్తయ్యాయి. ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, జోన్లు, ఖైరతాబాద్‌ ప్యాకేజీ-2లో రీ కార్పెటింగ్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా చార్మినార్‌ జోన్‌లో 5.925 కి.మీల మేర రీ కార్పెటింగ్‌ పనులు పూర్తయ్యాయి. వీడీసీసీ రోడ్ల నిర్మాణమూ అంతంత మాత్రంగానే సాగుతోంది. చార్మినార్‌ జోన్‌, ఖైరతాబాద్‌ ప్యాకేజీ-1, 2లో పనులు మొదలు కాలేదు. సికింద్రాబాద్‌లో ఎల్‌బీనగర్‌లో 0.07 కి.మీలు, శేరిలింగంపల్లిలో 0.21 కి.మీలు, కూకట్‌పల్లిలో 0.15, సికింద్రాబాద్‌లో 0.61 కి.మీల మేర పననులు జరిగాయి.


మీడియన్ల మరమ్మతు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులదీ అదే దుస్థితి. తక్కువ ఖర్చు, శ్రమతో ఆకర్షణీయంగా కనిపించే లేన్‌ మార్కింగ్‌, కెర్బ్‌ పెయింటింగ్‌ పనులపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని జోన్లలో ఇప్పటి వరకు 69.50 కి.మీల మేర లేన్‌ మార్కింగ్‌, 68.16 కి.మీల మేర కెర్బ్‌ పెయింటింగ్‌ పూర్తి చేశారు. కేవలం 18 సైనేజ్‌ బోర్డులు మాత్రమే ఏర్పాటు చేశారు. చార్మినార్‌ జోన్‌లో 32 మ్యాన్‌హోళ్ల కవర్లు రిప్లేస్‌ చేశారు. వర్షాలు తగ్గే నవంబర్‌ నుంచి మే వరకు రహదారుల నిర్మాణానికి అనువైన కాలం. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. మరో మూడు నెలల్లో ఎంత మేర పనులు జరుగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని సంస్థలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయని నేపథ్యంలో వర్షాకాలం లోపు 50 శాతం పనులు చేయడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు కూడా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే అవకాశముంది.  


ఇవీ వివరాలు...


జోన్‌ మొత్తం రోడ్డు రీ-కార్పెటింగ్‌ వీడీసీసీ మీడియన్‌ లేన్‌ కెర్బ్‌

(కి.మీలలో) జరిగింది మరమ్మతు మార్కింగ్‌ పెయింటింగ్‌

ఎల్‌బీనగర్‌ 138.771 -- 0.07 0.04 10.56 11.60

చార్మినార్‌ 100.427 5.925 -- 1.50 10.38 3.23

ఖైరతాబాద్‌-1 81.500 0.89 -- -- 16.45 3.02

ఖైరతాబాద్‌-2 90.498 -- -- -- 13.10 2.87

శేరిలింగంపల్లి 108.440 1.30 0.21 1.40 1.70 16.68

కూకట్‌పల్లి 82.121 -- 0.15 -- 7.82 9.72

సికింద్రాబాద్‌ 107.733 1.37 0.18 -- 9.50 21.03

మొత్తం 709.490 9.48 0.61 2.94 69.50 68.16

Updated Date - 2020-03-02T09:16:44+05:30 IST